Stock Markets: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్... ఐటీ షేర్ల జోరుతో లాభాల్లో మార్కెట్లు

Stock Markets End in Green After Four Days of Losses
  • ఆర్బీఐ పాలసీకి ముందు మార్కెట్ల రికవరీ
  • 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • అమెరికా డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి విలువ
  • మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీల్లో కొనసాగిన బలహీనత
  • ఆర్బీఐ పాలసీ నిర్ణయంపై వేచిచూస్తున్న ఇన్వెస్టర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల వరుస నష్టాలకు స్వస్తి పలికాయి. గురువారం జరిగిన ట్రేడింగ్‌లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం మార్కెట్లకు కలిసొచ్చింది. అయితే, శుక్రవారం వెలువడనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో లాభాలు పరిమితంగానే ఉన్నాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 158.5 పాయింట్లు లాభపడి 85,265.32 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 47.75 పాయింట్లు పెరిగి 26,033 వద్ద ముగిసింది.

సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ అత్యధికంగా 1.4 శాతం లాభపడింది. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాలు కూడా రాణించాయి. మరోవైపు, నిఫ్టీ మీడియా సూచీ 1.45% నష్టపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బ్రాడర్ మార్కెట్లలో మాత్రం బలహీనత కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 స్వల్పంగా నష్టపోగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.24 శాతం క్షీణించింది.

సెన్సెక్స్ షేర్లలో టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ ప్రధానంగా లాభపడగా... రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ నష్టపోయాయి. 

ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 28 పైసలు బలపడి 89.91 వద్ద ట్రేడ్ అయింది. ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై కొత్త ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిందని విశ్లేషకులు తెలిపారు.
Stock Markets
Sensex
Nifty
RBI Monetary Policy
IT Stocks
Rupee
Indian Economy
Share Market
TCS
Infosys

More Telugu News