Mir Osman Ali Khan: ప్రపంచ కుబేరుడి రాజసం... ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ కథ!

Mir Osman Ali Khan and the Story of Hyderabad House Delhi
  • ఢిల్లీలో హైదరాబాద్ నవాబు కట్టించిన రాజసం హైదరాబాద్ హౌస్
  • ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిజాం కీర్తి
  • సీతాకోకచిలుక ఆకారంలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ల్యూటిన్స్ రూపకల్పన
భారతదేశ రాజధాని ఢిల్లీలో విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇచ్చే అత్యంత కీలకమైన భవనం ఏదంటే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్ హౌస్. అయితే, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన దర్పాన్ని, వైభవాన్ని చాటుకోవడానికి కట్టించిన భవనమే ఇదని చాలా మందికి తెలియదు.

బ్రిటిషర్లు కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు, కొత్త రాజధానిలో తమదైన ముద్ర వేయాలని దేశంలోని సంస్థానాధీశులు భావించారు. ఈ క్రమంలోనే, హైదరాబాద్ నిజాం ఢిల్లీలో ఓ రాజభవనం నిర్మించాలని సంకల్పించారు. వైస్రాయ్ హౌస్‌కు (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) దగ్గరలోనే స్థలం కావాలని ఆయన పట్టుబట్టారు. కానీ, బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. కింగ్స్ వే సమీపంలోని ప్రిన్సెస్ పార్క్‌లో హైదరాబాద్, బరోడా, జైపూర్ వంటి ఐదు సంస్థానాలకు స్థలాలు కేటాయించారు.

తన భవన నిర్మాణ బాధ్యతలను నిజాం, వైస్రాయ్ హౌస్‌ను డిజైన్ చేసిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుట్యెన్స్ కే అప్పగించారు. వైస్రాయ్ హౌస్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తన భవనం ఉండాలని నిజాం కోరినప్పటికీ, ప్రభుత్వ నిబంధనల మేరకు అది సాధ్యపడలేదు. అయినప్పటికీ, లుట్యెన్స్ దీన్ని సీతాకోకచిలుక ఆకారంలో (బటర్‌ఫ్లై షేప్) అద్భుతంగా డిజైన్ చేశారు. 1920లలో సుమారు 2 లక్షల పౌండ్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో 36 గదులు, విశాలమైన ప్రాంగణాలు, యూరోపియన్, మొఘల్ శైలుల మేళవింపుతో కూడిన వాస్తుశిల్పం కనిపిస్తుంది.

స్వాతంత్ర్యం తర్వాత, ముఖ్యంగా 'ఆపరేషన్ పోలో'తో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యాక, ఈ భవనం ప్రాభవాన్ని కోల్పోయింది. నిజాం రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. అనంతరం దీని యాజమాన్యం భారత ప్రభుత్వానికి బదిలీ అయింది.

1974లో విదేశాంగ మంత్రిత్వ శాఖ దీన్ని స్వాధీనం చేసుకుని, ప్రధాని అధికారిక అతిథి గృహంగా మార్చింది. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుల నుంచి రష్యా అధినేతల వరకు ప్రపంచ దేశాధినేతలకు సమావేశాలు, విందుల కోసం ఈ భవనాన్నే వినియోగిస్తున్నారు. ఒకప్పుడు నిజాం దర్బారుకు ప్రతీకగా నిలిచిన ఈ భవనం, నేడు భారతదేశ దౌత్య సంబంధాలకు కేంద్రంగా మారింది. 
Mir Osman Ali Khan
Hyderabad House
Delhi
Nizam of Hyderabad
Indian Palaces
Edwin Lutyens
Operation Polo
Foreign Ministry
State Guest House
Diplomacy

More Telugu News