త్వరలో టోల్‌ప్లాజాల వద్ద ఒక్క క్షణం ఆగకుండా సరికొత్త వ్యవస్థ: నితిన్ గడ్కరీ

  • లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించిన గడ్కరీ
  • ఇప్పటికే 10 ప్రాంతాల్లో అమలు చేస్తున్నామన్న గడ్కరీ
  • టోల్‌ప్లాజా వద్ద ఆగకుండా సరికొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థ
టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఉండేందుకు వీలుగా సరికొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థను మరికొద్ది నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థను ఇప్పటికే 10 ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని, ఒక సంవత్సరం లోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన అన్నారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత విధానానికి స్వస్తి పలికి, ఏడాదిలో దేశవ్యాప్తంగా కొత్త విధానం అమల్లోకి రానుందని ఆయన స్పష్టం చేశారు.

"ప్రస్తుత టోల్ వసూలులో ఉన్న విధానానికి బదులుగా కొత్త ఎలక్ట్రానిక్ విధానం అమలులోకి రానుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్‌ప్లాజాల వద్ద ఎవరూ మిమ్మల్ని ఆపరు. దేశవ్యాప్తంగా దీనిని త్వరలో అమలు చేస్తాం" అని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం, టోల్‌ప్లాజాల వద్ద ఫీజు వసూలు చేసేందుకు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కార్యక్రమాన్ని ఎన్పీసీఐ తీసుకువచ్చింది. ఇది ఫాస్టాగ్ ద్వారానే పని చేస్తుంది. టోల్‌ప్లాజా మీదుగా వాహనం వెళ్లినప్పుడు ఆపాల్సిన అవసరం లేకుండానే యూజర్ బ్యాంకు ఖాతా నుంచి ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.


More Telugu News