Humayun Kabir: బాబ్రీ మసీదు కడతానన్న ఎమ్మెల్యేపై వేటు.. టీఎంసీ నుంచి సస్పెన్షన్

Humayun Kabir Suspended From TMC Over Babri Masjid Remark
  • బాబ్రీ మసీదు ప్రతిరూపం నిర్మిస్తానన్న ఎమ్మెల్యే
  • టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్ వేటు
  • ఇది బీజేపీ విభజన రాజకీయమన్న తృణమూల్ కాంగ్రెస్
పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మిస్తానని ప్రకటించిన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముర్షిదాబాద్ జిల్లాలో డిసెంబర్ 6న మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని కబీర్ ప్రకటించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

ఈ విషయంపై కోల్‌కతా మేయర్, టీఎంసీ సీనియర్ నేత ఫిర్హాద్ హకీం స్పందించారు. "మా పార్టీ లౌకిక సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది. ముర్షిదాబాద్‌కు చెందిన మా ఎమ్మెల్యే ఒకరు అకస్మాత్తుగా బాబ్రీ మసీదు కడతానని ప్రకటించారు. ఈ విషయంలో మేం ఆయన్ను ముందే హెచ్చరించాం. పార్టీ నిర్ణయం ప్రకారం హుమాయున్ కబీర్‌ను సస్పెండ్ చేస్తున్నాం" అని ఆయన తెలిపారు.

ఇది బెంగాల్‌ను మతపరంగా విభజించేందుకు బీజేపీ అనుసరిస్తున్న విధానం లాంటిదని ఫిర్హాద్ హకీం ఆరోపించారు. "కబీర్ డిసెంబర్ 6వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? మసీదుకు బదులుగా పాఠశాల లేదా కళాశాల నిర్మించవచ్చు కదా? ఎన్నికలకు ముందు ఇలాంటి విభజన రాజకీయాలు చేయడం అన్నది బీజేపీకి అలవాటు. కబీర్ కూడా ఇప్పుడు అలాంటి విభజన రాజకీయాలలో పడ్డారు " అని ఆయన విమర్శించారు.

ఎమ్మెల్యే కబీర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, శుక్రవారం టీఎంసీకి రాజీనామా చేసి, సొంత పార్టీని స్థాపించి మసీదు నిర్మాణం అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కబీర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వివాదంపై గవర్నర్ ఆనంద బోస్ కూడా స్పందించారు. కబీర్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంటే, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

డిసెంబర్ 6న కార్యక్రమం నిర్వహించడానికి కబీర్‌కు అనుమతి ఉన్నప్పటికీ, ముర్షిదాబాద్ జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండి, భద్రతను కట్టుదిట్టం చేశారు. 
Humayun Kabir
Babri Masjid
Trinamool Congress
TMC
West Bengal Politics
Firhad Hakim
Mamata Banerjee
Murshidabad
Political Suspension

More Telugu News