చిన్నప్పటి వైరస్‌తో బ్లాడర్ క్యాన్సర్.. శరీర రక్షణే శాపమా?

  • చిన్నప్పుడు సోకే బీకే వైరస్‌తో బ్లాడర్ క్యాన్సర్ ముప్పు
  • వైరస్‌పై పోరాటంలో మన కణాల డీఎన్ఏ దెబ్బతింటున్న వైనం
  • యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్ శాస్త్రవేత్తల పరిశోధన
  • వైరస్‌ను ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ నివారణకు అవకాశం
చిన్నతనంలో సర్వసాధారణంగా సోకే ఒక వైరస్, భవిష్యత్తులో బ్లాడర్ క్యాన్సర్‌కు కారణం కావచ్చని యూకే పరిశోధకులు తేల్చారు. ఈ వైరస్‌ను ముందుగా గుర్తించి నియంత్రించగలిగితే, బ్లాడర్ క్యాన్సర్‌ను నివారించేందుకు ఒక కొత్త మార్గం దొరుకుతుందని యూనివర్సిటీ ఆఫ్ యార్క్ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఈ అధ్యయన వివరాలు 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

పరిశోధన ప్రకారం బాల్యంలో సోకే 'బీకే వైరస్' (BK Virus) ఎలాంటి లక్షణాలు చూపించకుండా కిడ్నీలలో నిద్రాణంగా ఉండిపోతుంది. అయితే, ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు మన శరీరంలోని రక్షణ వ్యవస్థ చేసే పోరాటమే అసలు సమస్యకు కారణమవుతోంది. వైరస్‌పై దాడి చేసేందుకు ఉద్దేశించిన ఎంజైమ్‌లు, పొరపాటున మన శరీర కణాల డీఎన్ఏనే దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రక్రియను పరిశోధకులు 'ఫ్రెండ్లీ ఫైర్'గా అభివర్ణించారు. ఇలా దెబ్బతిన్న డీఎన్ఏ కాలక్రమేణా క్యాన్సర్‌కు దారితీస్తుందని వారు కనుగొన్నారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సైమన్ బేకర్ మాట్లాడుతూ.. "సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటిలో వైరస్ డీఎన్ఏ మన జన్యుపదార్థంతో కలిసిపోయి కణితులు ఏర్పడటానికి కారణమవుతుంది. కానీ, బ్లాడర్ క్యాన్సర్ విషయంలో వైరస్‌పై మన శరీరం జరిపే ప్రతిస్పందనే డీఎన్ఏ మార్పులకు, తద్వారా క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు మా పరిశోధనలో తేలింది" అని వివరించారు.

వైరస్ సోకిన కణాలతో పాటు వాటి చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాల డీఎన్ఏ కూడా దెబ్బతింటున్నట్లు గుర్తించారు. చాలా ఏళ్ల తర్వాత బ్లాడర్ క్యాన్సర్‌ను గుర్తించే సమయానికి కణితులలో వైరస్ ఆనవాళ్లు ఎందుకు కనిపించవనే దానికి ఇది సమాధానం కావచ్చునని బేకర్ తెలిపారు. ప్రస్తుతం ధూమపానం మానేయడం ద్వారా బ్లాడర్ క్యాన్సర్‌ను నివారించాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధన ఫలితాలు బీకే వైరస్‌ను నియంత్రించడం ద్వారా ఈ క్యాన్సర్‌ను నివారించేందుకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.


More Telugu News