లోక సభ ప్రశ్నోత్తరాలలో.. ప్రశ్న, జవాబు రెండూ టీడీపీ ఎంపీల నుంచే..!

  • పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించగా.. మంత్రి హోదాలో గుంటూరు ఎంపీ పెమ్మసాని జవాబు
  • గిరిజన గ్రామాలకు 4జీ నెట్‌వర్క్‌ ఎప్పుడు అనుసంధానం చేస్తారని అడిగిన పల్నాడు ఎంపీ
  • మారుమూల ప్రాంతాలు కావడంతో పర్యావరణ, అటవీ అనుమతుల సమస్యలు ఉన్నాయన్న పెమ్మసాని
  • నెట్ వర్క్ లేనిచోట్ల 27 వేల 4జీ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరణ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీకి చెందిన ఒక ఎంపీ సంధించిన ప్రశ్నకు టీడీపీకే చెందిన మరో ఎంపీ కేంద్ర మంత్రి హోదాలో జవాబునిచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మధ్య ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

ఇంతకీ ఆయన ఏమడిగారు, ఈయన ఏం జవాబిచ్చారంటే..
నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గిరిజన గ్రామాలకు 4జీ నెట్‌వర్క్‌ సమస్యను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో ఎస్టీ జనాభాతోపాటు, పీవీటీజీ ఆవాస ప్రాంతాలు అధిక సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. ఈ గ్రామాల్లో 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం భూమి కేటాయించినా ఇంతవరకూ ఆ సౌకర్యం అందుబాటులోకి తేలేదని చెప్పారు. ఈ ప్రాంతాలకు 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తేవడానికి నిర్దిష్ట గడువు ఏమైనా ఉందా? అని అడిగారు. 

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ బదులిస్తూ.. పల్నాడు తన సొంత ప్రాంతమని, ఆ ప్రాంతం కోసం పనిచేయడం తనకెంతో సంతోషకరమైన 
విషయమని చెప్పారు. అయితే, ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించిన గ్రామాలు మారుమూల ప్రాంతాలు కావడంతో టవర్ల ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతుల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. 

ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో కచ్చితంగా చెప్పడం కష్టమన్నారు. ఇలాంటి చోట్ల ఎదురవుతున్న వాస్తవ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రతీ ఎంపీకి తాను లేఖ రాశానని తెలిపారు. నెట్‌వర్క్‌ ఏర్పాటును వేగవంతం చేయడానికి బీఎస్ఎన్ఎల్ తో కలిసి పనిచేయాలని ఎంపీలను కోరానని వివరించారు. నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో 27వేల 4జీ నెట్‌వర్క్‌ టవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.


More Telugu News