అదృష్టం అంటే ఇదే.. భారతీయుడిని వరించిన రూ.61 కోట్ల లాటరీ

  • సౌదీలో నివసించే కేరళ వ్యక్తికి జాక్‌పాట్
  • అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో రూ.61 కోట్ల గెలుపు
  • 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న పీవీ రాజన్
సౌదీ అరేబియాలో నివసిస్తున్న మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కేరళకు చెందిన పీవీ రాజన్, అబుదాబిలో నిర్వహించిన 'బిగ్ టికెట్' లక్కీ డ్రాలో ఏకంగా 25 మిలియన్ దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.61.37 కోట్లు) గెలుచుకున్నారు. 15 సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయనకు ఎట్టకేలకు ఈ భారీ జాక్‌పాట్ తగిలింది.

వివరాల్లోకి వెళ్తే, పీవీ రాజన్ నవంబర్ 9న 282824 నంబర్‌తో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా నిర్వహించిన సిరీస్ 281 డ్రాలో ఆయన టికెట్‌కే మొదటి బహుమతి లభించింది. లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి ఈ శుభవార్తను అందించగా రాజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ ప్రైజ్ మనీని తాను ఒక్కడినే వుంచుకోనని, తన 15 మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటానని ఆయన ఉదారంగా ప్రకటించారు.

గత సిరీస్ విజేత, మరో భారతీయుడైన శరవణన్ చేతుల మీదుగా ఈ డ్రా తీయడం విశేషం. ఇదే డ్రాలో మరో 10 మంది కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. వీరికి తలా 10,000 దిర్హామ్‌లు (రూ.2.45 లక్షలు) లభించగా, వారిలోనూ ముగ్గురు భారతీయులు ఉండటం గమనార్హం. గల్ఫ్ దేశాల్లో భారతీయులకు లాటరీ తగలడం అన్నది ఇటీవల సాధారణమైపోయింది.


More Telugu News