విజయవాడ భవానీపురంలో హైటెన్షన్.. కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే

  • విజయవాడ భవానీపురం జోజి నగర్‌లో ఇళ్ల కూల్చివేతలతో తీవ్ర ఉద్రిక్తత
  • భారీ పోలీసు బందోబస్తు మధ్య 16 ఇళ్లను కూల్చేసిన సొసైటీ
  • నిరసనగా రోడ్డుపై బైఠాయించిన బాధితులు, యువకుడి ఆత్మహత్యాయత్నం
విజయవాడ భవానీపురం పరిధిలోని జోజి నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు లక్ష్మీ రామా కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు 42 ప్లాట్లను ఖాళీ చేయించేందుకు భారీ పోలీసు బందోబస్తు నడుమ పొక్లెయిన్లతో తరలివచ్చి 16 ఇళ్లను కూల్చివేశారు. మిగతా ప్లాట్ల యజమానులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే, సాయంత్రానికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించడంతో బాధితులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.
 
తమ ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధితులు సితార సెంటర్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. నిరసన కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందని న్యాయవాదులు చెప్పినా కూల్చివేతలు కొనసాగించారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని బాధితులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. 
 
 వివాద నేపథ్యం ఇదే..

సుమారు 20 ఏళ్ల క్రితం స్థల యజమాని, లక్ష్మీరామా కోపరేటివ్ సొసైటీకి మధ్య అగ్రిమెంట్ జరిగింది. అయితే సొసైటీ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో యజమాని ఆ స్థలాన్ని 42 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై సొసైటీ పదేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించగా, ఇటీవల వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే సొసైటీ సభ్యులు నిన్న కూల్చివేతలు చేపట్టారు.
 
ఈ పరిణామాల మధ్య, బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం, ఇళ్ల తొలగింపు ప్రక్రియను ఈ నెల 31 వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సాయంత్రానికి వచ్చాయి. దీంతో ఒకే రోజు నాటకీయ పరిణామాల మధ్య బాధితులకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.


More Telugu News