స్మృతి మంధాన పెళ్లిపై ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ పోస్ట్.. సోషల్ మీడియాలో చర్చ!

  • ఆగిన స్మృతి మంధాన పెళ్లి
  • పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో పెరిగిన అనుమానాలు
  • పెళ్లి వాయిదా మాత్రమే పడిందన్న స్మృతి సోదరుడు
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ వేడుక ఆరోగ్య కారణాలతో నిలిచిపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనేక ఊహాగానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, పెళ్లి రోజున స్మృతి తండ్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాతి రోజే వరుడు పలాశ్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే మెహందీ, హల్దీ వేడుకలు ఘనంగా జరగడంతో ఈ ఆకస్మిక పరిణామాలు అందరిలోనూ ఆందోళన నింపాయి.

ఈ క్రమంలో, వివాహ వేడుకలను నిర్వహిస్తున్న ‘క్రయాన్జ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే సంస్థ.. "జీవితంలో ఆడే ప్రతీ మ్యాచ్‌లో గెలవలేం, కానీ క్రీడాస్ఫూర్తి ముఖ్యం" అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ కావడంతో పెళ్లి రద్దయిందేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను తొలగించడం ఈ చర్చను మరింత పెంచింది.

పెరుగుతున్న వదంతుల నేపథ్యంలో ఇరు కుటుంబాలు స్పందించాయి. కేవలం ఆరోగ్య సమస్యల కారణంగానే పెళ్లి వాయిదా పడిందని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. తాజాగా స్మృతి సోదరుడు శ్రవణ్ మంధాన మాట్లాడుతూ, "ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది. కొత్త తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య స్మృతి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్‌కు కూడా దూరంగా ఉన్నారు.



More Telugu News