'చాయ్‌వాలా 'గా ప్రధాని మోదీ.. కాంగ్రెస్ నేత ఏఐ వీడియోపై తీవ్ర దుమారం

  • ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాగిణి నాయక్ వీడియో
  • చాయ్‌వాలాగా ప్రధానిని చూపిస్తూ ఏఐ జనరేటెడ్ వీడియో షేర్ చేసిన వైనం 
  • ప్రధానిని అవమానించారంటూ బీజేపీ తీవ్ర ఆగ్రహం
  • పార్లమెంట్ సమావేశాల వేళ రాజుకున్న రాజకీయ వివాదం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకురాలు ఒకరు షేర్ చేసిన వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ నేత రాగిణి నాయక్, ప్రధాని మోదీని 'చాయ్‌వాలా'గా చిత్రీకరిస్తూ రూపొందించిన ఒక ఏఐ (AI) జనరేటెడ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో ప్రధాని మోదీ ఒక చేతిలో టీ కెటిల్, మరో చేతిలో కప్పులు పట్టుకుని టీ అమ్ముతున్నట్లుగా ఉంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ చర్య సిగ్గుచేటని, ఇది ప్రధాని మోదీని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

గతంలో కూడా 'చాయ్‌వాలా' అంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలను ప్రధాని మోదీ తనకు అనుకూలంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఏఐ టెక్నాలజీతో వీడియోను సృష్టించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.


More Telugu News