నటన అంటే ఉద్యోగం కాదు.. 8 గంటల పని వివాదంపై రానా సంచలన కామెంట్స్

  • ఇన్ని గంటలే చేయాలి అని నిర్వచించడం కష్టమన్న సినీ హీరో
  • 8 గంటలు కదలకుండా పనిచేయడానికి యాక్టింగ్‌ అనేది ప్రాజెక్ట్‌ కాదని వెల్లడి
  • ఒకరోజు అదనపు షూటింగ్ కన్నా రోజూ కొన్ని గంటలు అదనంగా పనిచేయడమే మేలన్న దుల్కర్ సల్మాన్
ఇండస్ట్రీలో పనిగంటలపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. తాను రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని బాలీవుడ్ నటి దీపికా పడుకొణే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మిగతా రంగాల తరహాలోనే ఇండస్ట్రీలోనూ నిర్ణీత పని గంటలు ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై తాజాగా టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా స్పందించారు. నటన అంటే ఉద్యోగం కాదని చెప్పారు. ఇన్ని గంటలే చేయాలని నిర్వచించడం కష్టమన్నారు.

రోజుకు 8 గంటలు కదలకుండా కూర్చొని పనిచేస్తే అద్భుతమైన ఔట్ పుట్ రావడానికి యాక్టింగ్‌ అనేది ప్రాజెక్ట్‌ కాదని వ్యాఖ్యానించారు. నటన అనేది ఓ లైఫ్ స్టైల్ అని, నటులు దీనిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ లైఫ్ స్టైల్ కొనసాగించాలా? వద్దా? అనేది పూర్తిగా ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందేనని చెప్పారు. మిగతా రంగాలతో పోలిస్తే సినిమా రంగం భిన్నమైందని రానా గుర్తుచేశారు. ఇండస్ట్రీలో ప్రతీ విభాగంలోనూ నటీనటులు భాగమైతేనే గొప్ప సన్నివేశాలు వస్తాయని రానా పేర్కొన్నారు.

దుల్కర్‌ సల్మాన్ స్పందిస్తూ..
ఒక రోజు అదనపు షూటింగ్‌ కంటే రోజూ కొన్ని గంటలు అదనంగా పనిచేయడం సులువని దుల్కర్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. తెలుగు, మలయాళం, తమిళ ఇండస్ట్రీలో తన అనుభవాన్ని వివరిస్తూ.. మళయాళంలో ఉదయం షూటింగ్ ప్రారంభమయ్యాక ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదన్నారు. తమిళ ఇండస్ట్రీలో మాత్రం నటీనటులకు ప్రతి నెలా రెండు ఆదివారాలు సెలవు ఇస్తారని వివరించారు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే.. మహానటి సినిమా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు తాను సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని దుల్కర్ సల్మాన్ గుర్తుచేసుకున్నారు.


More Telugu News