హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం.. సచిన్, ధోనీ, కోహ్లీల సరసన మహిళా క్రికెటర్ మైనపు విగ్రహం!

  • జైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం
  • ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డ్
  • ఇప్పటికే మ్యూజియంలో సచిన్, ధోనీ, కోహ్లీ విగ్రహాలు
  • విగ్రహం ఏర్పాటు పట్ల హర్మన్‌ప్రీత్ హర్షం
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. రాజస్థాన్‌లోని ప్రఖ్యాత జైపూర్ వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటికే ఆమె విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి.

ఈ విషయాన్ని మ్యూజియం వ్యవస్థాపకులు, క్యూరేటర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇటీవల తమ బృందం హర్మన్‌ప్రీత్‌ను కలిసి, విగ్రహం తయారీకి అవసరమైన కొలతలు, ఫొటోలు, వీడియోలు తీసుకుందని తెలిపారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు సాగిందని ఆయన వివరించారు.

"తన మైనపు విగ్రహం ఏర్పాటు పట్ల హర్మన్‌ప్రీత్ చాలా ఉత్సాహం చూపించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తన కుటుంబంతో కలిసి వస్తానని చెప్పారు. మ్యూజియం యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు" అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. సమావేశం సందర్భంగా హర్మన్‌ప్రీత్ మ్యూజియంలోని 'శీశ్ మహల్' గురించి ప్రశంసించారని, మైనపు విగ్రహాల తయారీ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారని ఆయన అన్నారు.

యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయడమే తమ మ్యూజియం విధానమని శ్రీవాస్తవ తెలిపారు. "హర్మన్‌ప్రీత్ వ్యక్తిత్వం యువ మహిళలకు ఎంతో ఆదర్శం. ఆమె విగ్రహం మా మ్యూజియం ప్రతిష్ఠ‌ను మరింత పెంచుతుంది. ఇక్కడ ఇప్పటికే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సైనా నెహ్వాల్, సందీప్ సింగ్ వంటి క్రీడాకారుల విగ్రహాలు ఉన్నాయి" అని ఆయన వివరించారు.

జైపూర్‌లోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన నహర్‌గఢ్ కోటలో ఈ మ్యూజియం ఉంది. హర్మన్‌ప్రీత్ విగ్రహం సందర్శకులకు కొత్త ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.


More Telugu News