Telangana Rising Global Summit: హైదరాబాద్‌లో దేశంలోనే తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ!

Telangana Government Announces Womens Football Academy in Hyderabad
  • 8, 9 తేదీల్లో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'
  • వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్న తెలంగాణ మంత్రులు
  • అతిథుల కోసం పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్‌తో ప్రత్యేక గిఫ్టులు
హైదరాబాద్ క్రీడా రంగంలో మరో కీలక మైలురాయిని అందుకోనుంది. దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే ఇది రెండో అకాడమీ కావడం విశేషం. దీనితో పాటు దేశంలో రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీని కూడా తెలంగాణలోనే నెలకొల్పనున్నారు.

ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే సదస్సులో హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాలు అందించనున్నారు. ఇందుకోసం రేపు మంత్రులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు పయనమవుతున్నారు.

సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Telangana Rising Global Summit
Hyderabad
Womens Football Academy
All India Football Federation
Aiff
Fifa
Global Summit
Telangana
Sports
Investments

More Telugu News