రూ.4 కోట్ల బీమా సొమ్ము కోసం దారుణం.. అన్నను టిప్పర్‌తో తొక్కించిన తమ్ముడు!

  • అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమ్ముడు
  • హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
  • అనుమానంతో పోలీసులను ఆశ్రయించిన బీమా సంస్థ ప్రతినిధులు
  • ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరి అరెస్ట్
చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. మానసికంగా పూర్తిస్థాయిలో పరిపక్వత లేని తన అన్న పేరు మీద కోట్లాది రూపాయల బీమా పాలసీలు చేయించి, ఆ డబ్బు కోసం అతడిని టిప్పర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటుచేసుకుంది. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

కేసు వివరాలను కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం మీడియాకు వెల్లడించారు. రామడుగుకు చెందిన మామిడి నరేశ్‌ (30) వ్యాపారాలు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి సుమారు రూ.1.5 కోట్ల అప్పులపాలయ్యాడు. అప్పుల నుంచి సులువుగా బయటపడేందుకు తన అన్న వెంకటేశ్‌ (37)ను చంపాలని కుట్ర పన్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేని, అవివాహితుడైన వెంకటేశ్‌ పేరు మీద రూ.4.14 కోట్ల విలువైన తొమ్మిది బీమా పాలసీలు చేశాడు.

అనంతరం, తన స్నేహితుడు నముండ్ల రాకేశ్‌, టిప్పర్‌ డ్రైవర్‌ మునిగాల ప్రదీప్‌లతో కలిసి హత్యకు పథకం వేశాడు. ప్లాన్ ప్రకారం నవంబర్ 29 రాత్రి, టిప్పర్‌ చెడిపోయిందని డ్రైవర్ ప్రదీప్‌తో తనకు ఫోన్‌ చేయించాడు. జాకీ తీసుకుని వెళ్లాలని చెప్పి వెంకటేశ్‌ను టిప్పర్ వద్దకు పంపించాడు. అక్కడ టైర్ కింద వెంకటేశ్‌ జాకీ పెడుతుండగా, నరేశ్‌ ఉద్దేశపూర్వకంగా టిప్పర్‌ను ముందుకు నడిపి అతనిపై నుంచి పోనిచ్చాడు. దీంతో వెంకటేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నరేశ్ అందరినీ నమ్మించాడు. అయితే, బీమా క్లెయిమ్ కోసం వెళ్లినప్పుడు నరేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బీమా సంస్థ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని తేల్చి, నరేశ్‌తో పాటు రాకేశ్‌, ప్రదీప్‌లను అరెస్టు చేశారు.


More Telugu News