ఇండిగోకు జీఎస్టీ షాక్.. రూ. 117 కోట్ల భారీ జరిమానా

  • ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు భారీ జరిమానా
  • రూ. 117.52 కోట్లు చెల్లించాలని జీఎస్టీ శాఖ ఆదేశం
  • ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
  • ఈ ఆదేశాలను కోర్టులో సవాలు చేస్తామన్న కంపెనీ
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు జీఎస్టీ విభాగం నుంచి భారీ షాక్ తగిలింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) నిబంధనలకు సంబంధించి కొచ్చి సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ రూ. 117.52 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు మంగళవారం కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది.

2018-19, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ క్లెయిమ్ చేసిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను జీఎస్టీ అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే రూ. 1,17,52,86,402 జరిమానాతో పాటు డిమాండ్ ఆర్డర్ జారీ చేసినట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తన ఫైలింగ్‌లో పేర్కొంది.

అయితే, అధికారుల ఆదేశాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, దీనిపై న్యాయపరంగా తమకు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. పన్ను నిపుణుల సలహాతో ఈ ఆదేశాలను ఉన్నత అధికారిక ఫోరంలో సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ జరిమానా ప్రభావం కంపెనీ ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలపై పెద్దగా ఉండబోదని కూడా వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో ఇంట్రా-డే ట్రేడింగ్‌లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు ధర రూ.95 (1.64%) మేర తగ్గింది.

మరోవైపు ఇవాళ‌ ఉదయం కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని ముంబైకి మళ్లించిన విషయం తెలిసిందే.


More Telugu News