రెండో వన్డే కోసం రాయ్‌పూర్‌కు టీమిండియా.. కోహ్లీకి చిన్నారుల ఘన స్వాగతం.. వీడియో ఇదిగో!

  • దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో భారత్ విజయం
  • రెండో వన్డే కోసం రాయ్‌పూర్‌కు చేరుకున్న జట్టు
  • విరాట్ కోహ్లీకి గులాబీలిచ్చి స్వాగతం పలికిన చిన్నారులు
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా, రెండో మ్యాచ్ కోసం రాయ్‌పూర్‌కు చేరుకుంది. అక్కడ భారత ఆటగాళ్లకు, ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి హోటల్‌కు చేరుకున్న కోహ్లీని చూసిన చిన్నారులు ఆనందంతో చుట్టుముట్టారు. గులాబీ పువ్వులు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగగా, మ‌రో సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరి ప్రదర్శనతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా గట్టిగా పోరాడినప్పటికీ, భారత బౌలర్లు కట్టడి చేయడంతో విజయం టీమిండియాను వరించింది.

ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికాకు కోల్పోయిన నేపథ్యంలో వన్డే సిరీస్‌ను విజయంతో ప్రారంభించడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు అందరి దృష్టి రాయ్‌పూర్‌లో జరగనున్న రెండో వన్డేపైనే ఉంది.


More Telugu News