Gautam Gambhir: గంభీర్‌ను వెనకేసుకురావడానికి నిరాకరించిన రవిశాస్త్రి

Ravi Shastri on Gautam Gambhirs Coaching Performance
  • టెస్టుల్లో టీమిండియా వరుస ఓటములు
  • హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై పెరుగుతున్న ఒత్తిడి
  • ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలన్న రవిశాస్త్రి
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. టెస్టు ఫార్మాట్‌లో, ముఖ్యంగా స్వదేశంలో జట్టు వైఫల్యాలు ఆయన పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గంభీర్‌తో పాటు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌తో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

రాహుల్ ద్రవిడ్ తర్వాత గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత్ ఐదు టెస్టు సిరీస్‌లు ఆడింది. వీటిలో కేవలం వెస్టిండీస్‌పై మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లపై ఓటమి చవిచూడగా, ఇంగ్లండ్‌తో సిరీస్‌ డ్రాగా ముగిసింది. ఈ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పరిణామాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. గంభీర్‌ను వెనకేసుకురావడానికి నిరాకరించిన ఆయన, ఆటగాళ్లు కూడా మరింత బాధ్యతాయుతంగా ఆడాలని సూచించారు. గువాహటిలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా 100/1 స్కోరు నుంచి 130/7కి పడిపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. "ఆటగాళ్లు చిన్నప్పటి నుంచి స్పిన్‌ను ఆడుతున్నారు. కాబట్టి వారు కూడా బాధ్యత తీసుకోవాలి" అని ప్రభాత్ ఖబర్‌కు చెందిన ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు.

"నేను కోచ్‌గా ఉండి ఉంటే, వైఫల్యానికి మొదటి బాధ్యత నేనే తీసుకునేవాడిని. కానీ, టీమ్ మీటింగ్‌లో ఆటగాళ్లను మాత్రం వదిలిపెట్టేవాడిని కాదు" అని శాస్త్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి గంభీర్ ఉద్యోగానికి వచ్చిన ముప్పేమీ లేనప్పటికీ, జట్టులో ఏదో సరిగ్గా లేదనే విషయాన్ని బోర్డు గుర్తించినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Gautam Gambhir
Team India
Ravi Shastri
BCCI
Ajit Agarkar
Test series
Indian cricket
Cricket coach
Rahul Dravid
South Africa

More Telugu News