Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలకు చెక్.. డీకే ఇంట్లో సిద్దూకు బ్రేక్‌ఫాస్ట్

Breakfast politics continues in Ktaka Congress CM Siddaramaiah reaches Dy CM Shivakumars residence
  • డీకే శివకుమార్ నివాసానికి వెళ్లిన సీఎం సిద్దరామయ్య
  • నాయకత్వ పోరు నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ
  • సిద్దూ కోసం ప్రత్యేకంగా నాటుకోడి వంటకాలు
  • అసెంబ్లీ సమావేశాల ముందు ఐక్యత చాటే ప్రయత్నం
కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాయకత్వ పోరు ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కీలక భేటీ జరిగింది. మంగళవారం ఉదయం బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న డీకే శివకుమార్ నివాసానికి సీఎం సిద్దరామయ్య అల్పాహార విందుకు హాజరయ్యారు. శివకుమార్, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్.. సిద్దరామయ్యకు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.

వారంలో వీరిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొనడం ఇది రెండోసారి. పార్టీలో ఐక్యతను చాటిచెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల‌ 8 నుంచి బెళగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం పర్యటన సందర్భంగా శివకుమార్ ఇంటి పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

సిద్దరామయ్యకు అత్యంత ఇష్టమైన 'నాటు కోడి' వంటకాలను ఈ విందులో ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు శివకుమార్ ముందే వెల్లడించారు. "కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మేమిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం" అని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సీఎం పదవి కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇరువురు నేతలు ఇదివరకే స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. హనుమాన్ జయంతి సందర్భంగా డీకే శివకుమార్ చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. కష్టాలను తొలగించే మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Karnataka Politics
DK Shivakumar
Siddaramaiah
Karnataka Congress
Breakfast Meeting
DK Suresh
Belagavi Assembly
Hanuman Jayanti
Congress Party

More Telugu News