వంశీ అనుచరులకు కోర్టులో షాక్.. కిడ్నాప్ కేసులో ఇద్దరికి రిమాండ్

  • ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో కీలక పరిణామం
  • వల్లభనేని వంశీ అనుచరులు ఇద్దరికి కోర్టులో చుక్కెదురు
  • వారెంట్‌ రద్దు కోసం రాగా రిమాండ్‌ విధించిన న్యాయమూర్తి
  • నిందితులకు ఈనెల 15 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ
  • ఇంకా పరారీలోనే మరో నలుగురు నిందితులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అనుచరులకు విజయవాడ ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో నిందితులుగా ఉన్న తేలప్రోలు రాము (A3), వజ్రకుమార్‌ (A6) లకు న్యాయస్థానం ఈనెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయించుకోవడానికి కోర్టుకు హాజరైన వారికి న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అనుచరులైన కొమ్మా కోటేశ్వరరావు, తేలప్రోలు రాము, వజ్రకుమార్, ఎర్రంశెట్టి రామాంజనేయులు, చేబ్రోలు శ్రీనివాసరావు, వేణు నిందితులుగా ఉన్నారు. వీరంతా కొంతకాలంగా పరారీలో ఉండటంతో, వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారెంట్లు జారీ చేసింది.

ఈ క్రమంలో, తమపై ఉన్న వారెంట్ రీకాల్ చేయించుకునేందుకు సోమవారం రాము, వజ్రకుమార్ కోర్టుకు హాజరయ్యారు. వారి అభ్యర్థనను పరిశీలించిన న్యాయాధికారి పి. భాస్కరరావు, వారికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 


More Telugu News