Anchal Mamilwar: మహారాష్ట్రలో పరువు హత్య.. ప్రియుడి రక్తాన్నే పాపిట సిందూరంగా పెట్టుకుని శపథం చేసిన యువతి!

Anchal Mamilwar Love Tragedy Family Betrayal Honor Killing in Nanded
  • కన్నవాళ్లను ఉరితీయాలని రోదించిన యువతి
  • పరువు హత్యలో పోలీసులది కీలక పాత్ర అని ఆరోపణ
  • 'వాడిని చంపేయండి' అని తన సోదరుడిని రెచ్చగొట్టారన్న బాధితురాలు
  • కడదాకా ప్రియుడి కుటుంబంతోనే ఉంటానని శపథం!
ప్రేమ పాపమా? కులం శాపమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్కముందే మరో ప్రేమ కథ నెత్తురోడింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవాళ్లే కాలయములై ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. కట్టుకున్నవాడితో కాపురం చేయాల్సిన ఓ యువతి, కడసారి చూపునకు కూడా నోచుకోని తన ప్రియుడి నిర్జీవ దేహానికే తాళి కట్టింది. అతడి రక్తంతోనే పాపిటను సిందూరంగా దిద్దుకుని, "నా కుటుంబమే నాకు నమ్మకద్రోహం చేసింది, నమ్మించి గొంతు కోసింది. నా భర్తను చంపిన నా తల్లిదండ్రులను, సోదరులను బహిరంగంగా ఉరితీయాలి" అంటూ ఆమె పెడుతున్న ఆర్తనాదాలు సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఈ కిరాతక పరువు హత్య దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

 హృదయాన్ని మెలిపెట్టే ఆ ప్రేమకథ.. విషాదాంతం! 
సంచలనం సృష్టిస్తున్న ఈ దారుణ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాందేడ్‌కు చెందిన అంచల్ మామిల్వార్ (21), అదే ప్రాంతానికి చెందిన సాక్షం తాటే (20) అనే యువకుడు మూడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఒక్కటై బతకాలని కలలు కన్నారు. అయితే, సాక్షం షెడ్యూల్డ్ కులానికి (SC) చెందినవాడు కావడమే వారి ప్రేమకు శాపంగా మారింది. అంచల్ కుటుంబం వారి వివాహానికి తీవ్రంగా అడ్డుచెప్పింది. తమ పరువుకు భంగం కలుగుతుందని భావించి, సాక్షంను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం, అంచల్ తండ్రి, ఇద్దరు సోదరులు, మరికొందరు బంధువులు కలిసి సాక్షంపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తుపాకితో కాల్చి, బండరాళ్లతో తలపై మోది కిరాతకంగా హత్య చేశారు.

పోలీసులే రెచ్చగొట్టారు.. బాధితురాలి సంచలన ఆరోపణ!

ఈ హత్య వెనుక పోలీసుల ప్రమేయం కూడా ఉందంటూ అంచల్ చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. కన్నీరుమున్నీరవుతూ ఆమె చెప్పిన మాటలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. "ఘటన జరిగిన రోజు ఉదయం, మా అన్న నన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. సాక్షంపై తప్పుడు కేసు పెట్టాలని నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. నేను అందుకు నిరాకరించాను. అప్పుడు అక్కడున్న పోలీసులు, 'కేసులు ఎందుకు? వాడిని లేపేసి రండి (చంపేసి రండి)' అని మా అన్నను రెచ్చగొట్టారు. దాన్నే సవాలుగా తీసుకుని, నా కళ్లెదుటే నా ప్రాణమైన సాక్షంను చంపేశారు" అంటూ ఆమె చేసిన ఆరోపణలు వ్యవస్థనే ప్రశ్నిస్తున్నాయి.

శవానికి తాళి.. రక్తంతో సిందూరం!
సాక్షం అంత్యక్రియల సమయంలో అక్కడికి చేరుకున్న అంచల్, అతడి మృతదేహంపై పడి విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అనంతరం, ఎవరూ ఊహించని విధంగా, అతడి నిర్జీవ దేహానికి పూలమాల వేసి, తాళి కట్టింది. అతని దేహంపై ఉన్న రక్తపు మరకలను తన పాపిటలో సిందూరంగా దిద్దుకుని, "ఈ రోజు నుంచి నేను సాక్షం భార్యను. జీవితాంతం అతడి కుటుంబంతోనే ఉంటాను. నా వాళ్లే నాకు ద్రోహం చేశారు, వారిని ఉరితీసే వరకు పోరాడతాను" అని శపథం చేసింది. 

ఈ ఘటనపై హత్య, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అంచల్ కుటుంబసభ్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పోలీసులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విచారణ ఏ మలుపు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Anchal Mamilwar
Saksham Thate
honor killing
Maharashtra murder
Nanded crime
love affair
intercaste marriage
police investigation
SC ST Act
crime news

More Telugu News