Covid Spike Protein: క్యాన్సర్‌కు కొవిడ్ స్పైక్ ప్రొటీన్‌ కారణమా?.. వాస్తవాలు ఏం చెబుతున్నాయి?

Covid Spike Protein Linked to Cancer Claims Debunked
  • కొవిడ్ స్పైక్ ప్రొటీన్‌తో క్యాన్సర్లు వస్తున్నాయని వైరల్ అవుతున్న వీడియో
  • ఆంకాలజిస్ట్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మొదలైన చర్చ
  • ఈ వాదనల్లో శాస్త్రీయ ఆధారం లేదని కొట్టిపారేసిన భారత ఆరోగ్య నిపుణులు
  • క్యాన్సర్ రావడానికి ఏళ్లు పడుతుందని, ఇది జీవశాస్త్రపరంగా అసాధ్యమని వెల్లడి
  • ఇలాంటి ప్రచారాలు వ్యాక్సిన్‌లపై అపనమ్మకాన్ని పెంచుతాయని నిపుణుల హెచ్చరిక
కొవిడ్-19 వైరస్ లేదా వ్యాక్సిన్‌ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే స్పైక్ ప్రొటీన్‌కు, తీవ్రమైన క్యాన్సర్‌లకు సంబంధం ఉందని చెబుతూ ఓ ఆంకాలజిస్ట్ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అయితే, ఈ వాదనలు శాస్త్రీయంగా నిరాధారమైనవని, జీవశాస్త్రపరంగా అసాధ్యమని భారత ప్రముఖ ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాట్రిక్ సూన్-షియోంగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తీవ్రమైన క్యాన్సర్ కణుతుల్లో స్పైక్ ప్రొటీన్‌ను కనుగొన్నట్లు తెలిపారు. 10-11 ఏళ్ల పిల్లల్లో పెద్దపేగు క్యాన్సర్, 13 ఏళ్ల బాలుడిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి అసాధారణ కేసులు చూశానని ఆయన చెప్పారు. 30 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న క్యాన్సర్ కణితి ఒక వ్యక్తిలో కొవిడ్/వ్యాక్సిన్ తర్వాత తీవ్రంగా వ్యాపించిందని ఉదహరించారు.

అయితే, ఇండియా టుడే కథనం ప్రకారం.. ఈ ఆరోపణలను భారత ఆరోగ్య నిపుణులు తోసిపుచ్చారు. ప్రముఖ ఆరోగ్య విధాన నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియా మాట్లాడుతూ.. ‘‘స్పైక్ ప్రొటీన్‌ను క్యాన్సర్‌తో ముడిపెట్టడం శాస్త్రీయంగా సరైంది కాదు. క్యాన్సర్ అనేది ఎన్నో కారకాల వల్ల చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందుతుంది. హెచ్‌పీవీ, హెపటైటిస్-బి వంటి వైరస్‌లు కూడా క్యాన్సర్‌ను కలిగించడానికి దశాబ్దాల సమయం తీసుకుంటాయి. కేవలం రెండు, మూడేళ్లలో ఒక వైరల్ ప్రోటీన్ వల్ల క్యాన్సర్ రావడం అసాధ్యం’’ అని వివరించారు.

శరీరంలోని కణజాలంలో స్పైక్ ప్రొటీన్ అవశేషాలు కనిపించడంపై పల్మనరీ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ పూజన్ పారిఖ్ స్పష్టతనిచ్చారు. వైరస్ తగ్గిన తర్వాత కూడా రోగనిరోధక వ్యవస్థ దాని భాగాలను నెమ్మదిగా బయటకు పంపుతుందని, ఇది చాలా సాధారణ ప్రక్రియ అని తెలిపారు. దీనివల్ల ఎలాంటి హాని ఉండదని చెప్పారు. వ్యక్తిగత అనుభవాలను శాస్త్రీయ ఆధారాలుగా పరిగణించలేమని, ఇలాంటి నిరాధారమైన వాదనలు వ్యాక్సిన్‌లపై నమ్మకాన్ని దెబ్బతీయడంతో పాటు, ధూమపానం, కాలుష్యం, ఊబకాయం వంటి అసలైన క్యాన్సర్ కారకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Covid Spike Protein
Cancer
Patrick Soon-Shiong
Covid 19
Cancer Tumors
Chandrakant Lahariya
Pulmonary Medicine
Pujan Parikh
Vaccine
Health

More Telugu News