తాడేపల్లిలో విషాదం.. ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా?

  • ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి ఆత్మహత్య
  • ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులే కారణమని ఆరోపణ
  • కట్నం కోసం వేధించాడని తండ్రి చిన్నరాముడు ఫిర్యాదు
  • తల్లి ఫిర్యాదుతో భర్త రాజేష్‌పై కేసు నమోదు 
  • పెళ్లైన కొన్ని నెలలకే ఘటన
ఆంధ్రప్రదేశ్‌లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి (27) ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసంలో ఆదివారం రాత్రి ఆమె ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నం కోసం వేధించడమే ఈ దారుణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మాధురి.. నంద్యాల జిల్లాకు చెందిన రాజేష్‌నాయుడిని ప్రేమించారు. వీరిద్దరికీ 2025 మార్చిలో కులాంతర వివాహం జరిగింది. అయితే, పెళ్లైన మూడో నెల నుంచే అదనపు కట్నం కోసం రాజేష్ తనను వేధిస్తున్నాడని మాధురి తన తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు రెండు నెలల క్రితం పోలీసుల సహాయంతో కుమార్తెను తాడేపల్లిలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటున్నారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి తీవ్ర మనస్తాపంతో తన గదిలోని బాత్రూమ్‌లో ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాధురి గర్భవతి అని కూడా తెలుస్తోంది.

మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు: తండ్రి చిన్నరాముడు
తన కుమార్తెను రాజేష్‌నాయుడు మోసం చేశాడని ఐఏఎస్ అధికారి చిన్నరాముడు ఆరోపించారు. ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి మహానందిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని, చంపేస్తానని కూడా బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా కుమార్తె మాతో ఫోన్‌లో మాట్లాడాలన్నా భర్త అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. భర్త ప్రేమ నిజం కాదని, అందుకే తనను తీసుకెళ్లడానికి రావడం లేదని తీవ్రంగా బాధపడేది. ఇలా జరుగుతుందని ఊహించలేదు’’ అని చిన్నరాముడు కన్నీటిపర్యంతమయ్యారు.


More Telugu News