కేంద్ర భద్రతా బలగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

  • కేంద్ర సాయుధ దళాల్లో 25,487 కానిస్టేబుల్ (జీడీ) పోస్టులకు నోటిఫికేషన్
  • పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు
  • డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
  • తొలిసారిగా తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో రాతపరీక్ష
నిరుద్యోగ యువతకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త అందించింది. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPF), స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్ (జీడీ) విభాగాల్లో ఖాళీగా ఉన్న 25,487 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం లభిస్తుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), అస్సాం రైఫిల్స్ (AR), స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈసారి హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగుతో కలిపి మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కలిసివచ్చే అంశం.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 1న ప్రారంభమై, డిసెంబర్ 31తో ముగుస్తాయి. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ , 2026 జనవరి 1. దరఖాస్తుల్లో సవరణలకు జనవరి 8 నుంచి 10 వరకు అవకాశం కల్పించారు. పరీక్షలను 2026 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.


More Telugu News