Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా 20 మంది ట్రాన్స్‌జెండర్లు

Hyderabad Metro Hires 20 Transgender Security Guards
  • భద్రతా సిబ్బందిగా ట్రాన్స్‌జెండర్లకు కీలక బాధ్యతలు
  • శిక్షణ పూర్తి చేసుకుని సోమవారం నుంచి విధుల్లోకి
  • మహిళల భద్రత, సామాజిక సాధికారతకు పెద్దపీట
  • తెలంగాణ ప్రభుత్వ సమ్మిళిత విధానాలకు అనుగుణంగా చర్యలు
హైదరాబాద్ మెట్రో రైల్ సామాజిక సమ్మిళితత్వం దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో 20 మంది ట్రాన్స్‌జెండర్లను భద్రతా సిబ్బందిగా నియమించింది. ప్రత్యేక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరంతా సోమవారం నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లు, రైళ్లలో తమ విధులను ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వ సమ్మిళిత విధానాలు, అణగారిన వర్గాల సాధికారతకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టినట్లు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోలో దాదాపు 30 శాతం మంది మహిళలే ఉంటారు. వారి భద్రత, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ నియామకాలతో భద్రతా వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని యాజమాన్యం విశ్వాసం వ్యక్తం చేసింది.

కొత్తగా విధుల్లో చేరిన ఈ సిబ్బంది మెట్రో స్టేషన్లలోని సాధారణ ప్రాంతాలతో పాటు, ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించిన కోచ్‌లలో భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులకు సమాచారం అందించడం, దిశానిర్దేశం చేయడం, బ్యాగేజ్ స్కానర్ల వద్ద పర్యవేక్షణ వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు.

ఈ చొరవ ద్వారా అణగారిన వర్గాలకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రయాణికులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశమని హైదరాబాద్ మెట్రో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం సామాజిక సాధికారతకు ఒక బలమైన సంకేతమని, మెట్రో వ్యవస్థపై మహిళల భద్రత, ప్రజల విశ్వాసాన్ని పెంచే దిశగా వేసిన కీలక అడుగు అని పేర్కొంది.
Hyderabad Metro
Transgenders
Metro Security
Telangana Government
Social Inclusion
Women Safety
Hyderabad Metro Rail
Employment
Security Guards
Empowerment

More Telugu News