Nara Lokesh: నిమ్మల ఒకప్పుడు మండలస్థాయి నేత... ఇప్పుడు మంత్రి... కారణం అదే: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Emphasizes Party Supremacy for Leaders Growth
  • గ్రామ, మండల స్థాయి నేతలు రాష్ట్ర నాయకులుగా ఎదగాలన్నదే టీడీపీ సిద్ధాంతమని వెల్లడి
  • గత ఐదేళ్ల వైసీపీ రాక్షస పాలనను ప్రజలకు గుర్తుచేయాలన్న లోకేశ్
  • మనం ఒక సైకోతో పోరాడుతున్నామనే విషయాన్ని మర్చిపోవద్దని సూచన
  • ప్రజల మనసులు గెలుచుకుని, ప్రభుత్వ పథకాలను వివరించాలని పిలుపు
  • పార్టీయే అత్యున్నతం, నేతలంతా ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం
గ్రామ, మండల స్థాయి అధ్యక్షులు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి నేతలుగా, మంత్రులుగా ఎదగాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, విధానమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనసులు గెలుచుకునేలా పనిచేయాలని, స్థానిక ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఐక్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో భాగంగా నిర్వహించిన 'కాఫీ కబుర్లు' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని ఒక విశ్వవిద్యాలయంతో పోల్చారు. ఇక్కడ కష్టపడి పనిచేసే వారికి ఉన్నతమైన అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారు. 

"2012లో మంత్రి నిమ్మల రామానాయుడు ఒక మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. ఈ రోజు ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఎదగాలి. పార్టీ లేకపోతే మనకు గుర్తింపు లేదు. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు. పార్టీయే సుప్రీం" అని ఆయన ఉద్ఘాటించారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోవాలని, అలక వీడి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతీ ఒక్కరూ దాన్ని తు.చ. తప్పకుండా పాటించాలన్నారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలన ఎంత రాక్షసంగా ఉందో ప్రజలందరూ చూశారని లోకేశ్ గుర్తుచేశారు. "మనం ఒక సైకోతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 67 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అందరం ఒకే లక్ష్యంతో పనిచేస్తేనే విజయాలు సాధిస్తాం" అని ఆయన అన్నారు. 

క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. "అహంకారం వద్దని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మనం ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. ప్రజల హృదయాలను గెలుచుకోవాలి" అని హితవు పలికారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని లోకేశ్ ఆదేశించారు. ముఖ్యంగా, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెన్షన్లను రూ. 4,000కు పెంచిన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తాను వారంలో ఒకరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. 

ప్రతిఒక్కరూ 'మై టీడీపీ' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, పార్టీ కార్యక్రమాల సమన్వయం ఇకపై యాప్ ద్వారానే జరుగుతుందని తెలిపారు. "కష్టపడకుండా ఫలితం రాదు. నేను పాదయాత్ర చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చాను. మీరందరూ కష్టపడితేనే పార్టీకి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది" అని మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణా తరగతులకు సుమారు వంద మంది మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పలువురు సీనియర్ నేతలు వారికి పార్టీ సిద్ధాంతాలు, బాధ్యతలపై మార్గనిర్దేశం చేశారు.
Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh
Nimmala Ramanaidu
Politics
AP Politics
Mandal Presidents
Training Program
My TDP App

More Telugu News