స్టాక్ మార్కెట్లో సరికొత్త చరిత్ర... జీవితకాల గరిష్ఠాలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీ

  • రెండో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
  • సరికొత్త ఆల్ టైమ్ హై స్థాయికి చేరిన సెన్సెక్స్, నిఫ్టీ
  • 86,000 మార్కుకు చేరువలో ట్రేడవుతున్న సెన్సెక్స్
  • మెటల్, ఆటో షేర్లలో జోరుగా కొనుగోళ్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు బలంగా 8.2 శాతంగా నమోదు కావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ సానుకూల పరిణామాలతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు ఆల్ టైమ్ హై స్థాయికి చేరాయి.

ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 85,997 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 26,289 వద్ద ట్రేడవుతున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. నిఫ్టీలో ఎస్‍బీఐ, ట్రెంట్, టాటా స్టీల్ షేర్లు ప్రధాన లాభాల్లో ఉండగా.. టెక్ మహీంద్రా, టాటా కన్జ్యూమర్, టైటాన్ కంపెనీ నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే మెటల్, ఆటో షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది.

సూచీలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో విలువలు సెప్టెంబర్ 2024 గరిష్ఠాల కంటే తక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ర్యాలీ కొన్ని ఎంపిక చేసిన షేర్లకే పరిమితం కావడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. ఎన్ఎస్ఈ 500లోని 330 షేర్లు ఇప్పటికీ సెప్టెంబర్ గరిష్ఠాల కంటే దిగువనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

అద్భుతమైన జీడీపీ గణాంకాల నేపథ్యంలో మార్కెట్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున, శుక్రవారం జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశంలో వడ్డీ రేట్లలో కోత ఉండకపోవచ్చని భావిస్తున్నారు. నవంబర్ 28న విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,672 కోట్లు అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 3,993 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.


More Telugu News