ఏపీ యువత గొంతుక పార్లమెంట్లో వినిపిస్తాం: లావు శ్రీకృష్ణదేవరాయలు

  • ఏపీ యువత సలహాలను కోరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
  • పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలను సూచించాలని విజ్ఞప్తి
  • సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలు చెప్పాలని పిలుపు
  • భాగస్వామ్య ప్రజాస్వామ్యంలో యువతను భాగం చేయడమే లక్ష్యమన్న టీడీపీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్ యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మరియు యువత భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలను పార్లమెంటులో ప్రస్తావించేందుకు, తమ అభిప్రాయాలు, సలహాలు తెలియజేయాలని ఆయన కోరారు.
 
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. "ప్రియమైన యువ మిత్రులారా,  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నేను, మా తోటి ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఏయే అంశాలను ప్రస్తావిస్తే బాగుంటుందో మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
 
భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తుందని, అందులో యువతను భాగస్వాములను చేయాలన్నదే తమ ఉద్దేశమని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించడానికి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తమ ఆలోచనలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని ఆయన యువతను కోరారు. ప్రజా సమస్యలపై యువత అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని, వాటిని పార్లమెంటులో వినిపించేందుకు టీడీపీ ఎంపీ చేసిన ఈ ప్రయత్నంపై పలువురు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ ను మంత్రి నారా లోకేశ్ రీట్వీట్ చేశారు. 


More Telugu News