భోగాపురం విమానాశ్రయం సిద్ధం.. వచ్చే నెలలో ఎగరనున్న తొలి విమానం!
- టెస్ట్ ఫ్లైట్కు సిద్ధమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
- డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో తొలి విమానం ఎగిరే అవకాశం
- ఇప్పటికే 92 శాతానికి పైగా పూర్తయిన నిర్మాణ పనులు
- కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు పర్యవేక్షణతో పనుల్లో అనూహ్య వేగం
- దేశంలోనే అతి పొడవైన రన్వేలలో ఒకటిగా 3.8 కి.మీ. రన్వే నిర్మాణం
దేశంలోనే అతి పొడవైన రన్వేలలో ఒకటిగా నిలిచేలా 3.8 కిలోమీటర్ల రన్వే నిర్మాణం దాదాపు 99 శాతం పూర్తయింది. టెర్మినల్ భవనం 90%, ఏటీసీ టవర్ 72% పనులు పూర్తి చేసుకున్నాయి. మత్స్యాకారంలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం ఇంటీరియర్ డిజైన్లో ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును జీఎంఆర్ సంస్థ నిర్మిస్తుండగా, ప్రస్తుతం 5,050 మంది కార్మికులు, ఇంజనీర్లు రేయింబవళ్లు పనిచేస్తున్నారు.
విభజన హామీలలో భాగంగా, గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు మందగించాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు ‘అల్లూరి సీతారామరాజు’ పేరును ఖరారు చేశారు.
విశాఖ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు ప్రత్యేక కనెక్టివిటీ రహదారి, విశాఖ-భోగాపురం మధ్య మెట్రో రైలు మార్గం వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర పర్యాటక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.