Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'తెలంగాణ' వ్యాఖ్యలు.. ప్యాకేజీ స్టార్ అంటూ తెలంగాణ ఎమ్మెల్యే తీవ్రవ్యాఖ్యలు

Pawan Kalyans Telangana Remarks Criticized by MLA Anirudh Reddy
  • తెలంగాణ నాయకుల దిష్టి వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరిచెట్లు ఎండిపోతున్నాయన్న పవన్ కల్యాణ్
  • 70 ఏళ్లు వచ్చినా ముఖ్యమంత్రివి కాలేవన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  • దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చేయాలని సవాల్
  • పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
తెలంగాణ నాయకుల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరిచెట్లు ఎండిపోతున్నాయన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌కు 70 ఏళ్లు వచ్చినా ముఖ్యమంత్రి కాలేరని, ఆయన ఒక ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. తమ దిష్టి తగిలితే పవన్ కల్యాణ్ గెలిచేవారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దమ్ముంటే తెలుగుదేశం పార్టీని వదిలి ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ నాయకుల నరదిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కల్యాణ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. అదే నిజమైతే, ఇతరులు బాగుపడవద్దనే ఉద్దేశం తెలంగాణ వారికి ఉంటే ఆంధ్ర వాళ్లు హైదరాబాద్, తెలంగాణలో వ్యాపారాలు చేసుకునేవారా అని ప్రశ్నించారు. నీటిపారుదల, నిర్మాణం సహా వివిధ రంగాల్లో ఆంధ్ర వాళ్లు ఉన్నారని, తాము ఒక్క మాట కూడా అనడం లేదని అన్నారు.

పవన్ కల్యాణ్ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌‍కు ఉప ముఖ్యమంత్రి అయ్యేవారా అన్నారు. ఆయన ఉండేది, వ్యాపారం చేసుకునేది మాత్రం తెలంగాణలోనే అని గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ నాయకులది నరదిష్టి అయితే ఆయన హైదరాబాద్‌లో ఆస్తులు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ తెలంగాణలో ఉన్న ఆస్తులను అమ్ముకుని విజయవాడలో ఉండాలని సవాల్ చేశారు. తాను కూడా పవన్ కల్యాణ్ అభిమానినేనని, అందుకే ఆయన ఓజీ సినిమా ప్లాప్ అయినా నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో రూ.800 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశానని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన తప్పుగా మాట్లాడారు కాబట్టి అది తప్పని చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Anirudh Reddy
Telangana
Janasena
Congress
AP Politics
Telangana Politics

More Telugu News