ఏపీ వనం.. అద్భుత భూతల స్వర్గం.. దాన్ని మ‌న‌మే కాపాడుకోవాలి: సాయి దుర్గా తేజ్

  • 'డిస్కవర్ ఆంధ్ర' డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్ విడుదల
  • సాయి దుర్గా తేజ్, నవదీప్ సారథ్యంలో డాక్యుమెంటరీ రూపకల్పన
  • ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అటవీ శాఖ పూర్తి సహకారం
  • మన సంస్కృతి, ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన సాయి తేజ్
ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుతమైన ప్రకృతి అందాలు, అటవీ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో 'డిస్కవర్ ఆంధ్ర' అనే డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ మన్నెపురి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, యంగ్ హీరో నవదీప్ సారథ్యం వహిస్తున్నారు. ఏపీ అటవీ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ, మన సంస్కృతిని, ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. "మన చుట్టూ ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఈ డాక్యుమెంటరీ చూస్తే తప్పక అనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం 2020లో 'గ్రీన్ పాస్' అనే ఎన్జీవో ప్రారంభించాను. నా 'రిపబ్లిక్' సినిమాలో కూడా ఇదే అంశాన్ని చర్చించాం. ఈ డాక్యుమెంటరీకి మణిశర్మ మ్యూజిక్ అందించడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రేక్షకులు, మీడియా మద్దతుగా నిలవాలి" అని కోరారు.

హీరో నవదీప్ మాట్లాడుతూ.. ఈ డాక్యుమెంటరీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం ఎలా లభించిందో వివరించారు. "ఆంధ్రలోని వైల్డ్‌లైఫ్‌ను ప్రపంచానికి చూపించాలనే తన కోరికను సాయి తేజ్ నాతో పంచుకున్నారు. నేను వెంటనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన తక్షణమే స్పందించి, ప్రాజెక్టుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేలా చూశారు. 72 నిమిషాల నిడివితో శ్రీకాంత్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ చూసి మన రాష్ట్రంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోతారు" అని తెలిపారు.

పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ డాక్యుమెంటరీ, ఏపీలోని అద్భుత‌మైన ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందుతోంది.




More Telugu News