హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం.. ఏకంగా రూ. 14 కోట్లు పోగొట్టుకున్న వైద్యుడు!

  • హైదరాబాద్ వైద్యుడికి సైబర్ కేటుగాళ్ల వల
  • నకిలీ షేర్ ట్రేడింగ్ పేరుతో రూ. 14.61 కోట్ల మోసం
  • ఫేస్‌బుక్ పరిచయంతో మొదలైన ఫ్రాడ్
  • రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యక్తిగత సైబర్ మోసంగా గుర్తింపు
  • కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటిచెప్పే సంచలన ఉదంతం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. నకిలీ షేర్ ట్రేడింగ్‌ను నమ్మి ఓ వైద్యుడు ఏకంగా రూ. 14.61 కోట్లు పోగొట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకే సైబర్ మోసంలో ఓ వ్యక్తి ఇంత భారీ మొత్తంలో నష్టపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఓ వైద్యుడికి గత ఆగస్టు 27న ఫేస్‌బుక్ మెసెంజర్‌లో 'మోనికా మాధవన్' అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తన వ్యక్తిగత సమస్యలు, విడాకుల కేసు గురించి చెప్పి సానుభూతి పొందింది. ఆ తర్వాత సంభాషణను టెలిగ్రామ్‌కు మార్చి, తాను షేర్ ట్రేడింగ్‌లో నిపుణురాలినని, రోజూ లక్షల్లో సంపాదిస్తున్నానని నమ్మబలికింది.

ఆమె మాటలు నమ్మిన వైద్యుడిని, తాను చెప్పిన నకిలీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించి సెప్టెంబర్ 30న తొలి పెట్టుబడిగా రూ. 30 లక్షలు పెట్టించింది. వెంటనే ఆయన వర్చువల్ ఖాతాలో రూ. 8.6 లక్షల లాభం చూపించి, అందులోంచి రూ. 85 వేలు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో వైద్యుడికి పూర్తి నమ్మకం కుదిరింది. మరింత లాభాల ఆశతో, ఆమె ఒత్తిడి మేర‌కు బ్యాంకు రుణాలు, స్నేహితుల వద్ద అప్పులు చేసి విడతలవారీగా సుమారు రూ. 14 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు.

అతడి వర్చువల్ ఖాతాలో బ్యాలెన్స్ రూ. 34 కోట్లుగా చూపించడంతో డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పన్నుల కింద రూ. 7.5 కోట్లు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన వైద్యుడు వారిని నిలదీయగా, మోనికా స్పందించడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం టీజీసీఎస్‌బీని ఆశ్రయించారు. విద్యావంతులు సైతం ఇలాంటి పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


More Telugu News