Akshaya: ట్రాన్స్‌జెండర్‌కు పరీక్ష హాల్‌లోకి నో ఎంట్రీ.. పేరు మార్చుకోవడమే తప్పయ్యిందా?

Transgender Akshaya Faces RRB Exam Hurdle Over Name Change
  • ఆర్ఆర్‌బీ పరీక్షకు హాజరైన ట్రాన్స్‌జెండర్‌కు చేదు అనుభవం
  • పత్రాల్లో పేర్లు వేర్వేరుగా ఉన్నాయని పరీక్షకు నిరాకరణ
  • హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో ఘటన
  • అధికారుల తీరుపై ట్రాన్స్‌జెండర్ సంఘాల ఆవేదన
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) నిర్వహించిన ఉద్యోగ పరీక్షలో ఓ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి తీవ్ర నిరాశ ఎదురైంది. ధ్రువపత్రాల్లో పేర్లు వేర్వేరుగా ఉన్నాయన్న కారణంతో అధికారులు ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఈ సంఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా శుంభునిపేటకు చెందిన భూక్య అజయ్‌సింగ్ (అలియాస్ అక్షయ), పదో తరగతి తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారి తన పేరును అక్షయగా మార్చుకున్నారు. అనంతరం ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల ఆర్‌ఆర్‌బీ ఉద్యోగానికి తన పదో తరగతి మెమోలోని పాత పేరుతోనే దరఖాస్తు చేసుకోగా, అదే పేరుతో హాల్ టికెట్ జారీ అయింది.

శుక్రవారం పరీక్ష రాసేందుకు హసన్‌పర్తిలోని కేంద్రానికి వెళ్లిన అక్షయను అధికారులు అడ్డుకున్నారు. ఆమె పత్రాలను పరిశీలించి, ఎస్‌ఎస్‌సీ మెమోలో అజయ్‌సింగ్‌గా, ఆధార్, పాన్ కార్డుల్లో అక్షయగా పేరు ఉండటంతో పరీక్షకు అనుమతించబోమని స్ప‌ష్టం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్షయ, కన్నీటితో పరీక్ష కేంద్రం నుంచి వెనుదిరిగారు.

ఈ ఘటనపై ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ రేఖ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సాంకేతిక కారణాలతో ఒకరి భవిష్యత్తును అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి సమస్యలపై అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.


Akshaya
Transgender
Railway Recruitment Board
RRB Exam
Name Change Issue
Hanmakonda
Telangana
Job Exam
Transgender Rights
Bhukya Ajay Singh

More Telugu News