Congress MLA: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అందుకే రెండో స్థానం: కాంగ్రెస్ ఎమ్మెల్యే

Medipally Satyam Criticizes BRS in Jubilee Hills ByElection
  • బీజేపీతో కుమ్మక్కు కావడం వల్ల బీఆర్ఎస్ రెండో స్థానంతో ఓట్లు వచ్చాయన్న మేడిపల్లి సత్యం
  • కేసీఆర్ అనే నియంత పెంపకంలో కేటీఆర్ అభినవ గోబెల్స్ అయ్యారని ఎద్దేవా
  • బీఆర్ఎస్‌ను ప్రజలు ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారని వ్యాఖ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కైందని, అందుకే ఆ పార్టీకి రెండో స్థానంలో ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. సీఎల్పీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ అనే నియంత పెంపకంలో కేటీఆర్ అభినవ గోబెల్స్‌లా తయారయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే కేటీఆర్ పనిగా మారిందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అక్కసు, కడుపుమంటతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆయన కనీసం పదేళ్ల పాటు కొనసాగుతారని జోస్యం చెప్పారు. ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో అవినీతి సొమ్ము పెద్ద మొత్తంలో ఉందని, అందుకే వారు విర్రవీగుతున్నారని వ్యాఖ్యానించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారని అన్నారు. ఆ ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించలేదని, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాతో బుద్ధి చెప్పారని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావుల గోబెల్స్ ప్రచారం వల్ల బీఆర్ఎస్‌కు ఉన్న విశ్వసనీయత పోతోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఆయన అన్నారు.

త్వరలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తామని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేధస్సును ఉపయోగించి తెలంగాణకు పెట్టుబడులు తీసుకువస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ సూటుబూటు వేసుకుని షో చేయడం తప్ప రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ వచ్చేసారి వంద సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Congress MLA
BRS Working Preisdent KTR
BJP and BRS
Jubliee Hills Election

More Telugu News