సొంత ఫోన్లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చలాన్లు.. హోంశాఖకు హైకోర్టు నోటీసులు

  • హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్ల విధానంపై హైకోర్టులో విచారణ
  • పోలీసులు సొంత మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీయడంపై తీవ్ర అభ్యంతరం
  • నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు జారీ చేస్తున్న చలాన్ల విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు తమ సొంత మొబైల్ ఫోన్లతో వాహనదారుల ఫొటోలు తీసి చలాన్లు వేయడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది.

రాఘవేంద్ర చారి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తన వాహనానికి మూడుసార్లు సొంత ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్లు పంపారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ట్రాఫిక్ చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, ట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీలపైనా హైకోర్టు రెండు రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి రాయితీల వల్ల చట్టంపై ప్రజల్లో భయం పోతుందని, క్రమశిక్షణారాహిత్యం పెరుగుతుందని అభిప్రాయపడింది. ఈ-చలానా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తీసుకున్న చర్యలేంటో తెలపాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజా పిటిషన్‌పై తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.



More Telugu News