YV Subba Reddy: నా పదవీకాలం తర్వాతే ఆ విషయం బయటపడింది: సీఐడీ విచారణలో వైవీ సుబ్బారెడ్డి

TTD Parakamani Case YV Subba Reddy Appears Before CID
  • పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి
  • రెండు గంటల పాటు ప్రశ్నించి స్టేట్‌మెంట్ నమోదు చేసిన అధికారులు
  • తన పదవీకాలం ముగిశాకే విషయం వెలుగులోకి వచ్చిందన్న వైవీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం ఆయన్ను సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించి, కీలక వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు.

డిసెంబర్ 2వ తేదీలోగా ఈ కేసుపై హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, అప్పటి సీఎస్‌వో నరసింహ కిశోర్‌లను కూడా విచారించారు. తాజాగా తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి కేసుకు సంబంధించిన పత్రాలను విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు.

విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. పరకామణి విషయంలో సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. "మీ హయాంలో దొంగతనం జరిగిందా? అని అడిగారు. కానీ, ఆ విషయం నా పదవీకాలం ముగిసిన తర్వాతే బయటపడింది... ఆనాడు ఈ విషయాన్ని ఎవరు దాచిపెట్టారో నాకు తెలియదని చెప్పాను" అని ఆయన వెల్లడించారు.

ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని అధికారులకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 
YV Subba Reddy
TTD
Tirumala Tirupati Devasthanam
Parakamani case
CID investigation
Dharma Reddy
Narasimha Kishore
Tirupati
Andhra Pradesh

More Telugu News