: అమరావతి భవిష్యత్తుకు ఇవి గట్టి పునాదులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపన
  • అమరావతి ఆర్థిక భవిష్యత్‌కు ఇది శుభసూచికం అన్న పవన్
  • ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం  
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రూ.1334 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఒక శుభసూచికమని పేర్కొన్నారు. పలు బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరడం అరుదైన విషయమని, ఆ ఘనతను అమరావతి సాధించిందని అన్నారు. ఈ కేంద్రాలన్నీ ఒకేచోట ఉండటం వల్ల ఆర్థికంగా అందరికీ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ రోజు వేస్తున్న పునాదులు అమరావతి ఆర్థిక భవిష్యత్తు నిర్మాణానికి అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతోనే రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారని పవన్ అన్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా సహకరిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

More Telugu News