Pinnelli Ramakrishna Reddy: పల్నాడు జంట హత్యల కేసు: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Pinnelli Brothers Denied Bail by Supreme Court in Palnadu Double Murder Case
  • ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • అరెస్ట్‌పై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేత
  • లొంగిపోయేందుకు సమయం కోరిన నిందితుల తరపు న్యాయవాది
పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది.

పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్‌కు అర్హులు కాదని జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో వారి అరెస్ట్‌పై విధించిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లొంగిపోయేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

ఈ ఏడాది మే 24న గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్ద వీరిని స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

ఇది ప్రమాదం కాదని, హత్యేనని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, మృతుల బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చగా, ఏ-6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ-7గా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఉన్నారు. అరెస్టు భయంతోనే వారు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా వారి పిటిషన్ తిరస్కరణకు గురైంది.

Pinnelli Ramakrishna Reddy
Palnadu
Guntur
Andhra Pradesh
Jula Kanti Brahma Reddy
TDP Leaders Murder Case
Supreme Court
Anticipatory Bail
Political Violence
Gundlapadu

More Telugu News