Donald Trump: త్వరలోనే వెనెజూలా భూభాగంపై దాడి చేస్తామంటూ ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump Announces Imminent Venezuela Military Action
  • డ్రగ్స్ మాఫియాను అంతం చేయడమే లక్ష్యమన్న అమెరికా
  • ఇప్పటికే కరేబియన్ సముద్రంలో భారీగా అమెరికా బలగాలు
  • మదురో సర్కార్ టార్గెట్‌గా అమెరికా అడుగులు
వెనెజూలా కేంద్రంగా పనిచేస్తున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే వెనెజూలా భూభాగంపై సైనిక ఆపరేషన్లు చేపడతామని స్పష్టం చేశారు. సముద్ర మార్గంలో డ్రగ్స్ రవాణాను అడ్డుకునే ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, అందుకే నేరుగా ఆ దేశంలోనే చర్యలు తీసుకోక తప్పవని హెచ్చరించారు.

ఇప్పటికే అమెరికా కరేబియన్ సముద్రంలో భారీ స్థాయిలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్‌లతో సైనిక బలగాలను మోహరించింది. ఈ దాడుల్లో సుమారు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తాజా ట్రంప్ ప్రకటనతో ఏ క్షణంలోనైనా అమెరికా దళాలు వెనెజూలాలోకి ప్రవేశించవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెనెజూలా ముఠాలు అమెరికాను డ్రగ్స్‌తో ముంచెత్తుతున్నాయని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ ముఠాలకు వెనెజూలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో సంబంధాలున్నాయని ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తోంది. మదురో ప్రభుత్వాన్ని తాము గుర్తించడం లేదని శ్వేతసౌధం ఇప్పటికే ప్రకటించింది. మదురో సర్కార్ రోజులు లెక్కపెట్టుకోవాలని ట్రంప్ ఇటీవల సోషల్ మీడియాలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

మరోవైపు, డ్రగ్స్ నిర్మూలన అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని, వెనెజూలాలోని అపారమైన చమురు నిల్వలను చేజిక్కించుకోవడానికే అమెరికా ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి.

Donald Trump
Venezuela
US military action
drug trafficking
Nicolas Maduro
Venezuela oil reserves
US foreign policy
military operations
Caribbean Sea
drug network

More Telugu News