ఐపీఎల్‌లో అమ్మకానికి మరో జట్టు!

  • అమ్మకానికి వచ్చిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు
  • ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా విక్రయం
  • ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా ఎక్స్ పోస్ట్‌తో వెలుగులోకి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్‌కు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంఛైజీ అమ్మకానికి సిద్ధమైనట్లు ప్రకటించగా, తాజాగా ఈ జాబితాలోకి రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా చేరినట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు బలాన్నిచ్చింది.

"ఒకటి కాదు.. రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నాయి. అవే ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్. వీటిని దక్కించుకునేందుకు నలుగురైదుగురు కొనుగోలుదారులు రేసులో ఉన్నారు. పూణె, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, యూఎస్‌ఏ నుంచి కొత్త యజమానులు వస్తారేమో చూడాలి!" అని హర్ష్ గొయెంకా తన ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారి, క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్‌కు 65 శాతం వాటా ఉంది.

ఇదిలా ఉండగా, ఆర్సీబీ యాజమాన్య సంస్థ డియాజియో ఇప్పటికే ఫ్రాంఛైజీ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు కూడా తెలియజేసింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అదర్ పూనావాలాతో పాటు మరో రెండు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఈ రెండు జట్లు కొత్త యాజమాన్యాల చేతికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News