Jogi Ramesh: నకిలీ మద్యం కేసు: జోగి సోదరుల కస్టడీ పొడిగింపు

Jogi Ramesh Custody Extended in Fake Liquor Case
  • నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌ ను విచారిస్తున్న సిట్ 
  • అద్దేపల్లి సోదరులతో వందలాది ఫోన్ కాల్స్‌పై ప్రధానంగా విచారణ
  • ఆరోపణలను ఖండించిన మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాములను సిట్ అధికారులు నిన్న విచారించారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా విజయవాడలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. అధికారుల ప్రశ్నలకు జోగి సోదరులు ఉక్కిరిబిక్కిరి అయినట్లు సమాచారం.

సిట్ అధికారులు ఇద్దరికీ కలిపి సుమారు 100 ప్రశ్నలు సంధించగా, జోగి రమేశ్ కొన్నింటికి మాత్రమే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. మరికొన్ని ప్రశ్నలకు డొంకతిరుగుడుగా బదులివ్వగా, ఇంకొన్నింటికి పూర్తిగా మౌనం వహించినట్టు సమాచారం. ముఖ్యంగా, ఈ కేసులోని ఇతర నిందితులైన అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావులతో జరిపిన ఫోన్‌కాల్స్‌పై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. గత మూడు నెలల్లో జోగి, అద్దేపల్లి సోదరుల మధ్య వందలాది ఫోన్‌కాల్స్ జరిగినట్టు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు, ఆ కాల్ డేటాను వారి ముందుంచి ప్రశ్నించారు. అయితే, ఒకే వీధిలో ఉంటాం కాబట్టి యోగక్షేమాలు కనుక్కోవడానికే ఫోన్లు చేసుకున్నామని వారు చెప్పినట్టు తెలిసింది.

ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం వ్యవహారం బయటపడటానికి ముందు తాను జోగి రమేశ్‌ను కలిశానని అద్దేపల్లి జనార్దనరావు విచారణలో వెల్లడించారు. ఈ అంశంపై ప్రశ్నించగా వారు ఖండించినట్లు తెలుస్తోంది. అలాగే, ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జోగి రాము తీసుకున్న రూ.9 లక్షల విషయంపై ప్రశ్నించగా.. తాను చాలా ఏళ్లుగా అటువైపే వెళ్లలేదని రాము చెప్పినట్టు తెలిసింది. విచారణ అనంతరం ఇద్దరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, జిల్లా జైలుకు తరలించారు.

ఇదిలా ఉండగా, జోగి సోదరుల కస్టడీని విజయవాడ కోర్టు మరో రోజు పొడిగించింది. వీరిని నెల్లూరు జైలు నుంచి విజయవాడకు తీసుకురావడానికి తొలిరోజు సమయం మొత్తం ప్రయాణానికే సరిపోయిందని, విచారణకు మరో రోజు గడువు కావాలని ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది. దీంతో వీరి కస్టడీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. 
Jogi Ramesh
Fake liquor case
Andhra Pradesh
Excise police
Jogi Ramu
Vijayawada court
Adepalli Janardhana Rao
Nellore jail

More Telugu News