Bharat Harkachand Shah: లాభాలంటూ నకిలీ స్టేట్‌మెంట్లు.. 72 ఏళ్ల వృద్ధుడికి రూ. 35 కోట్ల టోకరా!

Mumbai Man Bharat Harkachand Shah Duped of 35 Crore
  • నాలుగేళ్లుగా లాభాలంటూ నకిలీ స్టేట్‌మెంట్లు పంపిన బ్రోకరేజ్ సంస్థ
  • ఖాతాపై పూర్తి నియంత్రణ సాధించి భారీగా అనధికారిక ట్రేడింగ్
  • రూ.35 కోట్ల నష్టం వచ్చిందని, వెంటనే చెల్లించాలని కంపెనీ డిమాండ్
ముంబైకి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు భరత్ హరక్‌చంద్ షా ట్రేడింగ్ స్కామ్‌లో రూ. 35 కోట్లు కోల్పోయారు. గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ అనే బ్రోకరేజ్ సంస్థ తన భార్య ఖాతాను ఉపయోగించి నాలుగేళ్లుగా అనధికారిక ట్రేడింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పరేల్‌లో క్యాన్సర్ రోగుల కోసం భరత్ షా తక్కువ అద్దెకు గెస్ట్ హౌస్ నడుపుతుంటారు. 1984లో తండ్రి మరణం తర్వాత ఆయనకు షేర్ పోర్ట్‌ఫోలియో వారసత్వంగా వచ్చింది. అయితే, స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకపోవడంతో షా దంపతులు ఎప్పుడూ ట్రేడింగ్ చేయలేదు. 2020లో స్నేహితుడి సలహాతో గ్లోబ్ క్యాపిటల్ సంస్థలో డీమ్యాట్ ఖాతా తెరిచి, తమ షేర్లను బదిలీ చేశారు.

'పర్సనల్ గైడ్స్' పేరుతో సంస్థ నియమించిన ఇద్దరు ఉద్యోగులు అక్షయ్ బరియా, కరణ్ సిరోయా.. షా దంపతుల ఖాతాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. వారి ఇంటికే వచ్చి, తమ ల్యాప్‌టాప్‌ల ద్వారా లావాదేవీలు జరుపుతూ, షా చేత ఓటీపీలు, ఇతర వివరాలు ఎంటర్ చేయించారు. మార్చి 2020 నుంచి జూన్ 2024 మధ్య, షాకు ఏటా వచ్చిన స్టేట్‌మెంట్లలో లాభాలు ఉన్నట్టు చూపించారు. దీంతో ఆయనకు ఎలాంటి అనుమానం రాలేదు.

అయితే, జులై 2024లో గ్లోబ్ క్యాపిటల్ రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగం నుంచి ఫోన్ రావడంతో మోసం బయటపడింది. "మీ ఖాతాలలో రూ.35 కోట్ల డెబిట్ బ్యాలెన్స్ ఉంది. వెంటనే చెల్లించకపోతే మీ షేర్లను అమ్మేస్తాం" అని వారు హెచ్చరించారు. దీంతో షా తన మిగిలిన షేర్లను అమ్మి ఆ మొత్తాన్ని చెల్లించారు. తర్వాత అసలు స్టేట్‌మెంట్లను డౌన్‌లోడ్ చేసి చూడగా, తనకు పంపిన నకిలీ స్టేట్‌మెంట్లకు, వాస్తవ ట్రేడింగ్‌కు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తదుపరి విచారణ కోసం ఈ కేసును ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విచారణ విభాగానికి బదిలీ చేశారు.
Bharat Harkachand Shah
Mumbai
trading scam
Globe Capital Market
fraud
financial crime
share market
demat account
police investigation
financial loss

More Telugu News