Devji: పోలీసుల అదుపులో ఉన్న దేవ్‌జీ సహా 50 మందిని కోర్టులో హాజరుపరచాలి: మావోయిస్టుల డిమాండ్

Maoists Allege Arrest of Devji and 50 Others Demand Court Appearance
  • దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నారన్న దండకారణ్య కమిటీ
  • హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని వ్యాఖ్య
  • ఎన్‌కౌంటర్లకు నిరసనగా 30న దండకారణ్యం బంద్
మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీతో పాటు తమకు చెందిన మరో 50 మంది నాయకులు, కార్యకర్తలు పోలీసుల అదుపులో ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) సంచలన ఆరోపణలు చేసింది. అదుపులో ఉన్న వారందరినీ తక్షణమే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు డీకేఎస్‌జడ్‌సీ కార్యదర్శి వికల్ప్ పేరుతో నిన్న ఓ ప్రకటన విడుదలైంది.

ఈ నెల 22వ తేదీతో ఉన్న ఈ లేఖలో, ఇటీవలే జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 18న హిడ్మా సహా ఆరుగురిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని ఆరోపించింది. ఆ తర్వాతి రోజే, అంటే నవంబర్ 19న, అదే ప్రాంతంలో సురేశ్, శంకర్ సహా మరో ఏడుగురిని కూడా ఇలాగే హత్య చేశారని లేఖలో పేర్కొంది.

ఈ బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30వ తేదీన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, మావోయిస్టుల ఆరోపణలపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. 
Devji
Maoist
Dandakaranya Special Zonal Committee
Chhattisgarh
Hidma Encounter
Andhra Pradesh
Maredumilli
Naxalites
Fake Encounters
Viklap

More Telugu News