Srilakshmi IAS: సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

Srilakshmi IAS Case CBI Appeals to High Court Not to Dismiss
  • జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి
  • విచారణలోనే నేరం రుజువవుతుందని సీబీఐ వాదన
  • పాత నేరానికి కొత్త చట్టం కింద అనుమతి చెల్లదన్న శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది
  • తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసిన ధర్మాసనం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా? లేదా? అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని, అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది.

శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. అనుమతి ఇచ్చారా? లేదా? అన్నదే ముఖ్యం కానీ, ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు. ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని, ఇది నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు.

అయితే, శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. పాత నేరానికి కొత్తగా సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం డీవోపీటీ అనుమతి ఇవ్వడం చెల్లదని వాదించారు. దాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం కూడా సరైంది కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
Srilakshmi IAS
Jagan illegal assets case
Penna Cements
CBI High Court
Quash petition
Corruption case AP
Vivek Reddy lawyer
ACB Act
IAS officer

More Telugu News