పబ్లిక్ లో మహిళలపై వేధింపులు... ఐశ్వర్యారాయ్ స్పందన

  • బహిరంగ ప్రదేశాల్లో వేధింపులపై గళమెత్తిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్
  • డ్రెస్, లిప్‌స్టిక్‌ను నిందించొద్దంటూ కీలక వ్యాఖ్యలు
  • ధైర్యంగా నిలబడాలని మహిళలకు పిలుపు
  • సోషల్ మీడియాలో ఐశ్వర్య వ్యాఖ్యలకు ప్రశంసల వెల్లువ
  • ఓ బ్యూటీ బ్రాండ్ కార్యక్రమంలో ఐశ్వర్య స్ఫూర్తిదాయక మాటలు
ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సామాజిక సమస్యలపై తన గళాన్ని మరోసారి బలంగా వినిపించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపుల (స్ట్రీట్ హరాస్‌మెంట్) ఘటనల్లో బాధితులనే నిందించే ధోరణిపై ఆమె తీవ్రంగా స్పందించారు. "జరిగిన దానికి మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్‌స్టిక్‌నో నిందించవద్దు. వేధింపులు ఎప్పుడూ మీ తప్పు కాదు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మహిళలు ఇలాంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, తమ ఆత్మగౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవద్దని ఆమె పిలుపునిచ్చారు.

తాను పదేళ్లకు పైగా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ బ్యూటీ బ్రాండ్ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అది వైరల్‌గా మారింది. "మీరు బయటి ప్రదేశాల్లో వేధింపులను ఎలా ఎదుర్కొంటారు?" అని ప్రశ్నిస్తూ ఆమె తన సందేశాన్ని ప్రారంభించారు. 

వేధింపులకు గురైనప్పుడు చూపు తిప్పేసుకోవడం, వెనుకంజ వేయడం వంటి పాత పద్ధతులను విడిచిపెట్టాలని సూచించారు. "సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ, సూటిగా కళ్లలోకి చూడండి. తల ఎత్తుకుని ధైర్యంగా నిలబడండి. మీ శరీరం, మీ గౌరవం మీ సొంతం. మీ విలువ విషయంలో ఎప్పుడూ రాజీ పడకండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ శంకించకండి. మీ గౌరవం కోసం పోరాడండి. వేధింపులు ఎప్పటికీ మీ తప్పు కానే కాదు" అని ఐశ్వర్య స్పష్టం చేశారు.

మహిళల సమస్యలపై ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ ధైర్యంగా స్పందిస్తారనే పేరుంది. ఆమె తాజా వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించింది. "బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు సమాజంలో ఉన్న ఓ తీవ్రమైన సమస్య. దాని గురించి చాలా తక్కువగా చర్చిస్తున్నాం. మీరు అద్భుతంగా మాట్లాడారు" అని ఒకరు, "మహిళలు, యువతులందరికీ ఇది ఎంతో శక్తివంతమైన సందేశం" అని మరొకరు కామెంట్ చేశారు. "అమ్మాయిలందరికీ మీరు స్ఫూర్తి" అంటూ ఎందరో నెటిజన్లు ఆమెను ప్రశంసించారు.



More Telugu News