Telangana High Court: 54 మంది చనిపోయిన ఘటన చిన్నదేమీ కాదు: పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Telangana High Court Angered by Police Handling of 54 Deaths
  • సిగాచీ ఫార్మా పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం
  • ఇంత పెద్ద ఘటనకు డీఎస్పీతో దర్యాప్తా అని ప్రశ్నించిన సీజే
  • ఇప్పటివరకు నిందితులను గుర్తించకపోవడంపై తీవ్ర అసంతృప్తి
  • పూర్తి నివేదికతో హాజరు కావాలని దర్యాప్తు అధికారికి ఆదేశం
  • తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసిన ధర్మాసనం
సిగాచీ ఫార్మా పరిశ్రమలో 54 మంది కార్మికుల ప్రాణాలను బలిగొన్న పేలుడు ఘటనలో పోలీసు దర్యాప్తు తీరును తెలంగాణ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇంత పెద్ద దుర్ఘటన జరిగి నెలలు గడుస్తున్నా దర్యాప్తు పూర్తి కాకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది సాధారణ ప్రమాదం కాదని, ఇంతటి ఘోరంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పడం దారుణమని వ్యాఖ్యానించింది.

ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. "ఇప్పటికే 237 మంది సాక్షులను విచారించినా పురోగతి ఏది? పేలుడుకు బాధ్యులైన వారిని ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదు?" అని నిలదీసింది. ఇంతటి తీవ్రమైన ఘటనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయకపోగా, కేవలం డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేసు దర్యాప్తు పురోగతిపై పూర్తిస్థాయి నివేదికను వెంటనే సమర్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. దర్యాప్తులో పారదర్శకత లోపించరాదని, వేగంగా పూర్తి చేసి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించింది. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.
Telangana High Court
Sigaachi Pharma
Telangana
Pharma Industry Explosion
High Court
Telangana Police
Justice Aparesh Kumar Singh
Industrial Accident
Police Investigation
Public Interest Litigation

More Telugu News