Chandrababu: దేవతల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతా: సీఎం చంద్రబాబు

Chandrababu Inaugurates Venkateswara Temple Expansion in Amaravati
  • వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్ర‌బాబు శంకుస్థాపన
  • రెండు దశల్లో రూ.260 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు
  • రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీకి సూచన
  • రాజధాని కోసం భూములిచ్చిన రైతులను అభినందించిన ముఖ్య‌మంత్రి
రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, రైతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మొత్తం రూ.260 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో ఈ పనులను చేపట్టనున్నారు. తొలి దశలో రూ.140 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, ఏడంతస్తుల మహారాజగోపురం, వివిధ మండపాలు, పుష్కరిణి వంటివి నిర్మించనున్నారు. రెండో దశలో రూ.120 కోట్లతో మాడ వీధులు, అన్నదాన సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు, పరిపాలన భవనం వంటివి నిర్మిస్తారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... దేవతల రాజధాని స్ఫూర్తితో మన అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. "రాజధాని కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన ఈ ప్రాంత రైతులకు నా ధన్యవాదాలు. అమరావతిపై ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదు" అని ఆయన అన్నారు. తిరుమల వేంకటేశ్వరుడు తమ ఇలవేల్పని, అలిపిరి దాడి నుంచి ఆయనే తనకు ప్రాణభిక్ష పెట్టారని గుర్తుచేసుకున్నారు.

గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టి విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. ఈ పవిత్ర ఆలయ నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణంలో భక్తులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, సంపద ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
Chandrababu
Amaravati
Andhra Pradesh
Venkateswara Temple
Temple Construction
Pemasani Chandrasekhar
Tirumala
TTD
Farmers

More Telugu News