ఆసుపత్రి నుంచి పలాశ్ ముచ్చల్ డిశ్చార్జ్.. స్మృతితో పెళ్లిపై కొనసాగుతున్న సందిగ్ధం!

  • క్రికెటర్ స్మృతి మంధానతో పెళ్లి వాయిదా అనంతరం అస్వస్థత
  • పెళ్లి రోజే స్మృతి తండ్రికి గుండెపోటు.. ప్రస్తుతం క్షేమం  
  • తీవ్ర ఒత్తిడి కారణంగా ఆసుపత్రిలో చేరిన పలాశ్
ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానతో జరగాల్సిన ఆయన వివాహం వాయిదా పడిన నేపథ్యంలో, తీవ్రమైన ఒత్తిడి, అలసట కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఇంటికి పంపినట్లు ఆయన బృందం ధ్రువీకరించింది. తొలుత సాంగ్లీలోని ఆసుపత్రిలో చేరిన పలాశ్‌ను, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైలోని గోరెగావ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌వీ ఆసుపత్రికి తరలించారు.

పెళ్లి రోజే ఊహించని విధంగా ఇరు కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వీరి వివాహాన్ని వాయిదా వేశారు. పెళ్లి ముహూర్తం రోజున స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో పలాశ్‌ కూడా ఎసిడిటీ, వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో అస్వస్థతకు గురయ్యారు.

స్మృతి తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే పెళ్లిని వాయిదా వేయాలని పలాశ్ నిర్ణయించుకున్నట్లు ఆయన తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. "పలాశ్‌కు స్మృతి తండ్రితో చాలా మంచి అనుబంధం ఉంది. స్మృతి కంటే వాళ్లిద్దరే ఎక్కువ క్లోజ్. ఆయనకు అలా జరిగిందని తెలియగానే, స్మృతి కంటే ముందే పలాశ్ పెళ్లి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఆగాలని చెప్పాడు" అని ఆమె వివరించారు.

"ఆ విషయం తెలిసి పలాశ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏడుపు వల్ల అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. నాలుగు గంటల పాటు ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది. ఐవీ డ్రిప్ ఇచ్చారు. ఈసీజీ, ఇతర పరీక్షలు చేశారు. రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చినా, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు" అని అమితా ముచ్చల్ పేర్కొన్నారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగానే వైద్యులు పలాశ్‌ను తమ పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా కోలుకున్నాకే డిశ్చార్జ్ చేశారు. ఇదిలావుంచితే, పెళ్లి వాయిదాపై ఇప్పటివరకు పలాశ్ గానీ, స్మృతి గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


More Telugu News