ఏపీలో ఈ ఏడాది ఇప్పటివరకు 15,462 రోడ్డు ప్రమాదాలు.. 6,433 మంది మృతి

  • రోడ్డు ప్రమాదాల నివారణపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • ప్రతి ప్రమాదానికి థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశం
  • అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గవర్నర్లు, సీసీ కెమెరాలు
  • గుంతలు లేని రహదారులే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టీకరణ
  • ప్రైవేటు బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలకు ఉత్తర్వులు
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదంపైనా థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో సచివాలయంలో ఆయన రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, రవాణా శాఖ కమిషనర్ మనీశ్‌ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 15,462 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 6,433 మంది మరణించారని ముఖ్యమంత్రికి వివరించారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. మొత్తం ప్రమాదాల్లో 79 శాతం అతివేగం వల్లే జరుగుతున్నాయని అధికారులు నివేదించారు.

దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన కార్యాచరణ అమలు చేయాలన్నారు. "అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి చేయాలి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి అర కిలోమీటరుకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి, వాటిని ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేయాలి. రాష్ట్రంలోని 680 బ్లాక్‌ స్పాట్‌లలో రోడ్ ఇంజనీరింగ్ లోపాలను యుద్ధప్రాతిపదికన సరిదిద్దాలి" అని ఆదేశించారు. ప్రైవేటు బస్సులు, ముఖ్యంగా స్లీపర్ బస్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న మార్పులపై ఉక్కుపాదం మోపాలని ఆయన స్పష్టం చేశారు.

అలాగే గుంతలు లేని రహదారులే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులతో జరిగిన మరో సమీక్షలో తెలిపారు. రహదారుల పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, తప్పు చేసే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News