రైతులు నష్టపోకూడదు.. రెండు రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించండి: సీఎం చంద్రబాబు

  • ఏ పంటకూ ధర తగ్గకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు
  • రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల బకాయిలు చెల్లించాలని ఆదేశం
  • పత్తి రైతుల సమస్యలపై సమీక్ష నుంచే కేంద్ర కార్యదర్శికి ఫోన్
  • భారీ వర్షాల హెచ్చరికలతో రైతులను అప్రమత్తం చేయాలని సూచన
రాష్ట్రంలో ఏ రైతు కూడా పండించిన పంటకు నష్టపోకూడదని, పంటలకు ధరలు తగ్గకుండా, కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల బకాయిలను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో 50.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు గానూ రూ. 13,451 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, "చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని రెండు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలి. భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో రైతులకు తగినన్ని గోనె సంచులు అందించాలి," అని ఆదేశించారు.

సమీక్ష నుంచే కేంద్రానికి ఫోన్
పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెచ్చిన కొత్త విధానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరించారు. దీంతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నుంచే కేంద్ర టెక్స్‌టైల్స్ కార్యదర్శి నీలం రావుకు ఫోన్ చేసి మాట్లాడారు. కొత్త నిబంధనల వల్ల రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వర్ష సూచన ఉన్నందున త్వరగా పరిష్కరించాలని కోరారు.

పత్తి కొనుగోళ్ల సమస్యపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, ఈ బాధ్యతలను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలుకు అప్పగించాలని అధికారులకు సూచించారు. అరటి, జొన్న ధరల సమస్యల పరిష్కారానికి స్థానిక వ్యాపారులు, ఎగుమతిదారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ రైతులను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు.




More Telugu News