భారతీయులపై నోరు పారేసుకున్న అమెరికా కంపెనీ ఉన్నతాధికారి!

  • అమెరికన్ కంపెనీ క్యాంప్‌బెల్ ఉన్నతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు
  • భారతీయ ఉద్యోగులను 'ఇడియట్స్' అంటూ జాతి వివక్ష ఆరోపణలు
  • ఆడియో టేప్ లీక్ కావడంతో అధికారిపై వేటు, లీవ్‌పై పంపిన సంస్థ
  • ఫిర్యాదు చేసిన ఉద్యోగిని తొలగించడంతో ఆడియో బయటపెట్టిన వైనం
అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ 'క్యాంప్‌బెల్' (Campbell)లో ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారతీయ ఉద్యోగులను ఉద్దేశించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు, తమ కంపెనీ తయారుచేసే ఆహార ఉత్పత్తులు "పేద ప్రజల కోసం తయారుచేసిన చెత్త" అంటూ ఆయన మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఒకటి బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కంపెనీ సదరు అధికారిని తక్షణమే లీవ్‌పై పంపించి, అంతర్గత విచారణకు ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే, క్యాంప్‌బెల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మార్టిన్ బాలీ ఈ వివాదంలో చిక్కుకున్నారు. కంపెనీలో గతంలో సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌గా పనిచేసిన రాబర్ట్ గార్జా... బాలీపై పలు ఆరోపణలు చేశారు. మార్టిన్ బాలీ అనుచిత వ్యాఖ్యలపై తాను హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, కేవలం 20 రోజుల్లోనే తనను ఉద్యోగం నుంచి తొలగించారని గార్జా ఆరోపించారు. దీనికి ప్రతీకారంగా, బాలీ మాట్లాడిన మాటలతో కూడిన ఆడియో రికార్డింగ్‌ను ఆయన మీడియాకు లీక్ చేశారు.

లీకైన ఆడియోలో మార్టిన్ బాలీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "మనం పేద ప్రజల కోసం చెత్తను తయారు చేస్తాం. మన ఉత్పత్తులను ఎవరు కొంటారు? వాటిలో ఏముందో తెలిశాక నేను కూడా కొనడం మానేశాను. 3డీ ప్రింటర్ నుంచి వచ్చిన చికెన్‌ను నేను తినను" అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, "ఈ భారతీయులకు ఏమీ తెలియదు. వాళ్లు సొంతంగా ఆలోచించలేరు. వాళ్లు ఇడియట్స్" అంటూ తీవ్రమైన జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. తాను గంజాయి ఎడిబుల్స్ తీసుకుని తరచూ ఆ మత్తులోనే ఆఫీసుకు వస్తానని కూడా అతను అంగీకరించడం గమనార్హం.

ఈ వ్యవహారంపై క్యాంప్‌బెల్ కంపెనీ వెంటనే స్పందించింది. ఆ వ్యాఖ్యలు నిజంగా చేసి ఉంటే అవి ఏమాత్రం ఆమోదయోగ్యం కావని, అవి తమ కంపెనీ విలువలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. ఆహారంపై చేసిన ఆరోపణలు నిరాధారమని, తాము నాణ్యమైన పదార్థాలతో మంచి ఆహారాన్ని అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం మార్టిన్ బాలీని లీవ్‌పై పంపించామని, పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని ప్రకటించింది. దాదాపు 23 ఏళ్ల అనుభవం ఉన్న మార్టిన్ బాలీ, 2022లో క్యాంప్‌బెల్ కంపెనీలో చేరారు. గతంలో ఆయన ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకున్నారు. ఈ వివాదంతో ఆయన కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది.


More Telugu News